కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (municipal elections) నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, రెండో రోజు మొత్తం 7080 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అభ్యర్థులు వేర్వేరు సెట్ల రూపంలో నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 7403కు చేరింది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
నిబంధనల ప్రకారం రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. నిర్ణీత సమయం ముగిసేలోపు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వారందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.


