కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ (GHMC) కమీషనర్ ఆర్వీ కర్ణన్ శుభవార్త చెప్పారు. ఆస్తిపన్ను పాత బకాయిల వడ్డీలో 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆస్తి పన్ను కట్టే వారికి ప్రస్తుతం OTS స్కీమ్ అమల్లో ఉందని చెప్పారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటివరకు 2,184 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని వెల్లడించారు. ఓటీఎస్ (OTS) ద్వారా ఇప్పటివరకు 134 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని చెప్పారు. మూడు కార్పొరేషన్లలో కలిపి మొత్తం 28 లక్షల 20 వేల ఆస్తులున్నాయని తెలిపారు. జీహెచ్ ఎంసీలో (GHMC) 18 లక్షల ఆస్తులకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైందని వివరించారు. మొండి బకాయిదారులను సర్కిల్, జోన్ల వారీగా గుర్తిస్తున్నామని.. వారందరికీ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి మరో 15 రోజులు మాత్రమే ఉందని.. పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ అందరూ చెల్లించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను దశల వారీగా చెల్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తిపన్నును ప్రభుత్వంతో బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నామన్నారు. కరెంట్ ఇయర్ 2,766 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవ్వాల్సి ఉందని చెప్పారు. జీఐఎస్ సర్వే ద్వారా నగరంలో చాలా ఆస్తుల ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్నట్లు గుర్తించామని.. ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్న లక్షా 20 వేల ఆస్తులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ ను మైక్యూర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్ ను ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే వసూలు చేయాలని.. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వసూలు చేయకూడదన్నారు. ఔటర్ పరిధిలో గతంలో ఎలా ఉందో అలాగే ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్ కొనసాగుతుందని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా మారుతుందో ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుందన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మూడు కార్పొరేషన్లు కలిసి యాక్టివిటీ చేస్తున్నామని తెలిపారు. నగరంలో శానిటేషన్ పైన ఫోకస్ చేశామని వివరించారు. వాట్సప్ ద్వారా శానిటేషన్ సమస్యలను కంప్లెయింట్ చేయొచ్చని నగరవాసులను సూచించారు.
Read Also: వందే మాతరం సమయంలో ఎంఐఎం వాక్‌అవుట్.. బండి సంజయ్ ఫైర్
Follow Us On: Facebook

