కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 89,399 మంది భక్తులు దర్శించుకోగా.. 49,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, సోమవారంశ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల(Tirumala)కు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను సోమవారం అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు . భూదేవి కాంప్లెక్స్‌తో పాటు శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని అధికారులు పర్యవేక్షించారు. భక్తుల అవసరాల కోసం నాణ్యమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసులు, వివిధ విభాగాల అధికారులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో సేవలందిస్తున్నారని తెలిపారు.

