Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో నేడు తీవ్ర వడగాలులు.. వడదెబ్బకు 18 మంది మృతి

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తీవ్ర వడగాలులు (Heatwave Alert) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 26 మండలాల్లో తీవ్రవడగాలులు, 137 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం 70 మండలాల్లో తీవ్రవడగాలులు, 176 మండలాల్లో వడగాలులు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లోని రెండేసి మండలాల్లో, మన్యం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఒక్కో మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నాయి.

రాష్ట్రంలో హీట్ వేవ్..

భానుడి విజృంభణకు ఏపీ హడలిపోతోంది. రాష్ట్రంలో హీట్ వేవ్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడు,పెనమలూరుల్లో అత్యధికంగా 48.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీల వేడి నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 115 మండలాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. తీవ్రమైన ఎండకు వడదెబ్బ తగిలి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 18 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఈ వారం చివరికి నాటికీ అంటే శనివారం వరకు ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..

రాష్ట్రంలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో సుమారు 45°C నుంచి 46°C ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40°C నుంచి 42°C ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది.

పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం..

ఏపీలో హీట్‌వేవ్‌పై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులనుంచి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వడగాల్పుల నుంచి రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>