కలం, కరీంనగర్ బ్యూరో : వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడటానికి బదులుగా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని.. ‘మన ఆరోగ్యం మన బాధ్యత’ అనే భావనతో జీవనశైలిని మార్చుకోవాలని వైద్యులు సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) సందర్భంగా మంగళవారం కరీంనగర్ (Karimnagar) లోని మెడికవర్ ఆసుపత్రి (Medicover Hospitals) లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటి వ్యాధులు వచ్చినప్పుడు సోషల్ మీడియా ఆధారంగా స్వయంగా మందులు వాడడం ప్రమాదకరమని హెచ్చరించారు. సరైన వైద్య పరీక్షలు చేయించుకుని నిపుణుల సూచనల మేరకు చికిత్స పొందడం అత్యవసరమని అన్నారు. మద్యం సేవించడం, పొగ త్రాగడం, డ్రగ్స్ వినియోగం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. బదులుగా పోషకాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సరిపడ నిద్రపోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వివరించారు.
ప్రస్తుతం అనేక వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులో ఉన్నాయని, అవసరాన్ని బట్టి వాటిని తీసుకోవాలని సూచించారు. ఇటీవలి పరిశీలనల్లో 100 మందిలో 80 మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, చికిత్సను నిర్లక్ష్యం చేయడం ప్రాణాపాయం కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో మనుషుల జీవితకాలం గణనీయంగా పెరిగిందని, గతంలో 40 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుష్షు ఇప్పుడు 75 సంవత్సరాలకు పెరిగిందని పేర్కొన్నారు.
మెడికవర్ ఆసుపత్రిలో (Medicover Hospitals) వివిధ విభాగాలకు చెందిన 25 మంది నిపుణ వైద్యులు సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Read Also: 7 ప్రోటీన్ స్నాక్స్.. మీ ఎనర్జీకి బిగ్ బూస్ట్!
Follow Us On : WhatsApp

