కలం, మెదక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. పంట కొనుగోళ్ల (Paddy Procurement) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రులు వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న (మక్కలు), సన్‌ఫ్లవర్, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లింపులు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి..
మార్కెట్లలో ఇంకా సగం పైగా పంట నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని.. రైతులు 40 రోజుల నుండి ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. వరి ధాన్యం తరలించడానికి లారీల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆర్టీఏ అధికారులు, వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులను రంగంలోకి దించి, రోడ్లపై వెళ్లే ఖాళీ వాహనాలను మళ్లించి వెంటనే ధాన్యం తరలించాలని సూచించారు. రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదని, ప్రభుత్వం రైస్ మిల్ అసోసియేషన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక సివిల్ సప్లై లేదా రెవెన్యూ అధికారిని నియమించి పర్యవేక్షించాలని సూచించారు. వర్షాలు పడి పంట తడవకముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తాము ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులందరితో సమీక్షలు నిర్వహించి సమస్యలు లేకుండా చూశామని గుర్తు చేశారు.
లోడ్లను దించుకోవడం లేదు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వెళ్లిన లోడ్లను దించుకోవడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని తెలిపారు. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దే నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, కరెంట్, సాగునీరు.. చివరకు పండించిన పంటను అమ్ముకోవడంలో కూడా రైతులకు ఈ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదు అంటూ దుయ్యబట్టారు.మార్చి 22న సిద్దిపేట సభలో రేవంత్ రెడ్డి 45 రోజుల్లో రైతుబంధు నిధులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని… కానీ 52 రోజులు దాటినా రైతులకు ఆ నిధులు అందలేదని విమర్శించారు. సీఎం ఇప్పటికైనా నిద్ర లేవాలి, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీ చుట్టూ తిరగడం మానేసి.. రైతుల కష్టాలను చూడాలని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: వన్యప్రాణులకు రక్షణ : ఢిల్లీ వేదికగా IBCA సదస్సు!
Follow Us On : WhatsApp

