సర్కారు బడులకు సెక్యూరిటీ ఏది?

కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ కరువైంది. ఉమ్మడి వరంగల్ (Warangal)  జిల్లాలోని 2,868 పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేకపోవడంతో వేసవి సెలవుల్లో హెచ్ఎంలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తరగతి గదుల్లోని బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగల పాలైతే ప్రధానోపాధ్యాయులదే బాధ్యతని విద్యాశాఖ నిబంధన విధించింది. దీంతో వారే పాఠశాలలకు వెళ్లి స్వయంగా పహారా కాస్తున్నట్లు సమాచారం. ఒకపక్క వస్తువులు పోతే రికవరీ నోటీసులు వస్తాయనే భయంతో, చాలామంది హెచ్‌ఎంలు సెలవుల్లో కూడా పాఠశాలల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. కొంతమంది ఆ డ్యూటీ చేయలేక సొంత ఖర్చులతో ప్రైవేట్ వ్యక్తులను కాపలా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎండాకాలం దొంగల బెడద

వేసవిలో దొంగల బెడద పెరిగింది. సెలవుల్లో ఇళ్లు వదిలి ప్రయాణం చేద్దామంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఊళ్లకు, టూర్‌లకు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో విలువైన వస్తువులకు గ్యారెంటీ లేకుండా పోతోంది. దీంతో చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. పోలీసులు సైతం ఊరికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఇళ్ల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ ఆస్తులు సంరక్షణ సంగతి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆస్తుల రక్షణ కరువైందనే విమర్శలున్నాయి. వేసవి సెలవుల్లో పాఠశాలలు మూసి ఉండడం పెద్ద సమస్యగా మారింది. కొన్నేళ్లుగా పాఠశాలలకు వాచ్‌మెన్లు లేరు. పోస్టులు ఖాళీ అవడంతో భర్తీ జరగలేదని తెలుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలకు వాచ్‌మెన్ లేరు

ప్రభుత్వ పాఠశాలలను వాచ్ మెన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో వేసవి కాలం పాఠశాలలకు సెలవులు వచ్చాయంటే చాలు సంబంధిత హెచ్ ఎంలు నరకయాతన అనుభవవిస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసి ఉండటంతో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, మిడ్-డే మీల్ పాత్రలు, వైర్లు, సోలార్ ప్యానెళ్లు దొంగల పాలవుతున్నాయి. గ్రామాల్లో కొన్ని పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఇనుప సామాన్లు కూడా ఎత్తుకెళ్తున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వేసవి సెలవుల్లో సుమారు 20 పాఠశాలల్లో చోరీలు జరిగినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.

హెడ్ మాస్టర్లే వాచ్ మెన్లు!

ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నేళ్లుగా వాచ్‌మెన్ పోస్టుల భర్తీ జరగలేదని సమాచారం. ఉన్నవాళ్లు రిటైర్ అయినా కొత్త నియామకాలు చేపట్టలేదు. గతంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వాచ్‌మెన్ల నియామకం చేసేవారు. కానీ నిధుల కొరతతో ఆ వ్యవస్థ కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తులను వాచ్‌మెన్లు‌గా నియమించుకుందామంటే వేతన సమస్య. నెలకు రూ.6-8 వేల జీతానికి ఎవరూ రావడం లేదనే తెలుస్తోంది. 24 గంటల డ్యూటీ, రిస్క్ ఎక్కువ ఉండడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో హెడ్మాస్టర్‌లే తాళం చెవి దగ్గర పెట్టుకొని రోజూ పాఠశాలకు వెళ్లి మంచి చెడు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ, గ్రామస్తులు స్వచ్ఛందంగా రాత్రి పూట కాపలా కాస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వాచ్‌మెన్ పోస్టులు భర్తీ చేయడం లేదా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించి పాఠశాల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Read Also: వన్యప్రాణులకు రక్షణ : ఢిల్లీ వేదికగా IBCA సదస్సు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>