కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో రాజకీయంగా తీవ్ర వివాదం చెలరేగింది. ఈ కేసును నీరుగార్చేందుకు కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ కుట్ర పన్నుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని, బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నాలుగు రోజుల క్రితం నమోదైన పోక్సో కేసులో ఇప్పటివరకు అరెస్ట్ జరగకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కేసు నమోదు అయిన తర్వాత బాధితురాలి వివరాలు, ఫోటోలు బయటకు ఎలా వచ్చాయో ప్రశ్నించారు. ఈ విషయంలో బండి సంజయ్ పాత్రపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ఈ అంశాన్ని పార్టీకి సంబంధం లేని విషయమని చెప్పడం అవివేకమని విమర్శించారు. అలాగే సోషల్ మీడియాలో బాధితురాలిపై దుష్ప్రచారం జరుగుతోందని, ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన (Panjala Srinivas) డిమాండ్ చేశారు. సంబంధిత సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
Read Also: రైల్ రోకో కేసులో కవితకు సమన్లు!
Follow Us On : WhatsApp

