Mobile Popup Ad
Mobile Popup Ad

పోలవరం పూర్తయితే భద్రాచలం మునగడం ఖాయం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ రాశారు. తక్షణమే రెండు వేల బాధిత కుటుంబాలకు పరిహారం, శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద తక్షణమే కరకట్టల నిర్మాణంతో పాటు అక్కడే పీపీఏ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు బ్యాక్ వాటర్ ముప్పును ఎదుర్కొంటున్నాయని వివరించారు. వరద నీటిని గోదావరిలోకి పంపేందుకు తక్షణమే పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలన్నారు. కొత్తగా 5 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణంతో పాటు బూర్గంపాడు, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

లక్ష మందికి ఇబ్బంది..

పోలవరం ప్రాజెక్టులో భాగంగా 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిందని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు. బ్యాక్ వాటర్‌తో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాకల్లో భారీ నష్టం కలిగిందన్నారు. భద్రాచలం పట్టణం 40 శాతం జలమయమై.. లక్ష మందికి పైగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడినట్లు గుర్తు చేశారు. పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరిగ్గా అదే 45.72 మీటర్లుగా ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ఎల్లప్పుడూ ముంపు ప్రమాదమే అని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోందన్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందన్నారు. భారీ పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పు ఉంటుందని, దాదాపు 5 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>