కలం, కరీంనగర్ బ్యూరో : 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి మండలం పోరుమల్ల (Porumalla) గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas), జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ (Satya Prasad) పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, జల సంరక్షణ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వర్షాకాల ముందస్తు చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, సురక్షిత తాగునీటి సరఫరా, వన మహోత్సవం, మహిళల భద్రత, రోడ్డు భద్రత వంటి అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ వన మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామాలలో సురక్షిత తాగునీటి సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. రానున్న వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య చర్యలు కీలకమని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
గ్రామంలో ఐదు అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా, ఇప్పటికే ఒక భవనానికి మంజూరు లభించిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన భవనాలకు అవసరమైన భూమి అందుబాటులో ఉంటే మంజూరు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మూడు వీఓ భవనాల నిర్మాణ ప్రతిపాదనలలో ఒక భవనానికి మంజూరు లభించిందని, మిగిలిన రెండు భవనాలకు కూడా భూమి అందుబాటులో ఉంటే మంజూరు కల్పిస్తామని వెల్లడించారు. మంజూరైన భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, ఎంపీడీవో, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Also: ప్రధాని మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్..!
Follow Us On: Instagram

