అంతర్రాష్ట్ర నేరస్థుడు అరెస్ట్.. నిందితుడిపై 16 ఆస్తి నేరాల కేసులు

కలం, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 2న మూడావత్ అజయ్ రాత్రి తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటనపై బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో తిరుగుతున్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి నిందితుడికి (Interstate criminal arrested) అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ నిర్వహించారు.

విచారణలో అతడు బోయిని శ్రీకాంత్ @ శ్రీకాంత్, వయస్సు 24 సంవత్సరాలు, కమలాపూర్ గ్రామం, యాదవ మండలం, రంగారెడ్డి జిల్లా వాసిగా గుర్తించారు. విచారణలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆటో చోరీ కేసులో తానే నిందితుడినని అంగీకరించాడు. నిందితుడు తెలిపిన వివరాల మేరకు చోరీకి గురైన ఒక ఆటో రిక్షా, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి నేర చరిత్రను పరిశీలించగా.. అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 16 ఆస్తి నేరాల కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.

వాటిలో ప్రధానంగా మోసం (420 IPC), చోరీ (379 IPC), దొంగతనం (380 IPC), క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇతర ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వెల్లడైంది. గతంలో నమోదైన కేసుల్లో కాచిగూడ, సంజీవరెడ్డినగర్ (హైదరాబాద్), గార్లదిన్నె (అనంతపురం), తవణంపల్లె, పుత్తలపట్టు, చిత్తూరు, జమ్మలమడుగు (కడప), ఆదోని తదితర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వివిధ ప్రాంతాల్లో వాహనాల యజమానులు నిర్లక్ష్యంగా పార్క్ చేసిన ఆటోలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

అతనిపై మరిన్ని కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శివనాగేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, పోలీస్ కానిస్టేబుళ్లు అశోక్, కూర్మూర్తి, ఐటీ కోర్ సిబ్బంది ప్రవీన్ లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి, ఇదే విధంగా నేరాల నియంత్రణలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

వాహనదారులు తమ వాహనాలను ఎల్లప్పుడూ సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని, స్టీరింగ్ లాక్, వీల్ లాక్ వంటి భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను వాహనంలో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చోరీలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>