కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి (Parigi)లో రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను పోలీసులు మార్గమధ్యలోనే అరెస్ట్ చేశారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు రైతుల సమస్యలను హరీశ్ రావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించేందుకు హరీశ్ రావు బయలుదేరారు. ముందు హైదరాబాద్ నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా వారి నుంచి తప్పించుకొని హరీశ్ రావు పరిగి బయలుదేరారు. ఈ క్రమంలో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు హరీశ్ రావును అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ పాలన గడీల పాలన అని, దుర్మార్గపు పాలన అని హరీశ్ విమర్శలు గుప్పించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న తమను అడ్డుకొని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని, కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ సభలో మేము అరెస్టులు చేయము, మాది ప్రజాపాలన అని చెప్పి 24 గంటలు గడవకముందే ఎమ్మెల్యేలను ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయరు కానీ, అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని విమర్శించారు. ఒక వైపు రైతులు భూములు ఇవ్వము అంటున్నా ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రైతుల దగ్గరికి వెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. ఇలా అక్రమ అరెస్టులు చేయడమే మీ ప్రజాపాలననా అని నిలదీశారు.
మరోవైపు పోలీసులు హరీశ్ రావు సహా సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను అరెస్ట్ చేసి శంషాబాద్ మీదుగా షాద్‌నగర్ వైపు తరలిస్తున్నారు. హరీశ్ రావును తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వెంబడిస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం. దీంతో పోలీసు వాహనాల వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్తుండటంతో రోడ్డుపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Read Also: అసైన్డ్ భూములపై సర్కార్ కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖ రిపోర్ట్
Follow Us On : WhatsApp

