ఏపీ మద్యం కేసు(AP Liquor Scam) కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులోని నిందితుల రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి తొలుత విధించిన రిమాండ్ నేటితో ముగియనున్న క్రమంలో వారిని సిట్ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ దృష్ట్యా నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని సిట్ అధికారులు అభ్యర్థించారు. వారి వాదనలను విన్న న్యాయస్థానం నిందితుల రిమాండ్‌ను అక్టోబర్ 13 వరకు పొడిగించింది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజవేఖర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య తదితరులు జైల్లో ఉన్నారు.
అయితే రిమాండ్ నుంచి బెయిల్‌పై విడుదలైన వారికి మినహాయింపు కల్పించాలని నిందితుల తరపు న్యాయవాది కోరారు. కాగా అందుకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ సందర్భంగానే యూఎస్ వెళ్లే పార్లమెంట్ బృందంలో మిథున్ రెడ్డి(Mithun Reddy) కూడా ఉన్నారన్న అంశాన్ని న్యాయవాది.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీసాకు దరఖాస్తు చేసుకోవడం కోసం పాస్‌పోర్ట్ అవసరమని, పోలీసులు కస్టడీలో ఉన్న పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇప్పించాలని న్యాయవాది కోరారు. అందుకు కూడా అవసరమైన పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం తెలిపింది. అయితే ఏపీ లిక్కర్ స్కాం( AP Liquor Scam) కేసులో మొత్తం 12 మంది అరెస్ట్ కాగా వారిలో ఐదుగురు బెయిల్‌పై విడుదలై ఉన్నారు.

