కాంగ్రెస్ ర్యాలీపై డీకే అరుణ తీవ్ర విమ‌ర్శ‌లు

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: దేశంలో అరాచకం సృష్టించాల‌ని రాహుల్ గాంధీ చూస్తున్నారని, ఈ విషయమై దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మహబూబ్‌న‌గ‌ర్‌ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. శనివారం కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో ఆమె మాట్లాడారు. భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని అనడం సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనం అని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఓటు చోరీ జరిగితే తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదన్నారు.

దేశ విచ్ఛిన్నకర శక్తులు యువతను రెచ్చగొడుతూ, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, ఓటు చోరీ అని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మాత్రమే కాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం అభివృద్ధి చేయాలన్నారు. కొడంగల్‌కి స్థానికుడు కాకపోయినా రేవంత్ రెడ్డిని ప్రజలు గెలిపించార‌న్నారు. కొడంగల్‌లో రోడ్ల విస్తరణ చేసి ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించడం లేదని మండిప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే వారికి పరిహారం అందించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్ట్ పైన సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి శాశ్వతంగా కరువును పారదోలెందుకు ప్రయత్నించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నీటి అప్రోచ్ నార్లపూర్‌కి మార్చి పాలమూరుకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.

హైదరాబాద్‌లో మహా పాదయాత్ర

నవంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర చేపడుతుందని డీకే అరుణ తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మోహింజహి మార్కెట్ వరకు పాదయాత్ర కొన‌సాగుతుంద‌న్నారు. ఈ పాద‌యాత్ర‌కు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం- అరాచకవాదాన్ని అంతం చేద్దామనే నినాదంతో పాదయాత్ర జరగనుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, పూనం చంద్ లహటి, ప్రతాప్ రెడ్డి, బస్వరాజు మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>