కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో.. తీవ్ర వర్షాభావం.. భూగర్భ జలాలు అడుగంటడడం, సాగు చేసిన పంటలు ఎండిపోవడం.. సరిగా రాని పంట దిగుబడి.. పెట్టుబడి ఖర్చులు రాకపోగా.. తీర్చలేని అప్పులు.. వెరసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు కరువు (Mahabubnagar Drought) కోరల్లో చిక్కారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా 78 మండలాలకు 63 మండలాలు కరువు ప్రాంతాలుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని అన్ని మండలాలు కరువు ప్రాంతాలుగా గుర్తించింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాలకు 13, నాగర్ కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు 13, వనపర్తి జిల్లాలోని 15 మండలాలకు 11 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు 44 మండలాల్లో ఉండగా.. గద్వాల, నారాయణపేట జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తుండగా.. మధ్యస్థ కరువు సుమారు 19 మండలాల్లో ఉన్నట్లు గుర్తించారు. గద్వాల జిల్లాలో అత్యధికంగా 50, నారాయణపేటలో 43, నాగర్‌కర్నూల్‌లో 40, వనపర్తిలో 38, మహబూబ్ నగర్ లో 37 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తేల్చారు.
తగ్గిన సాగు.. పెరిగిన నష్టాలు
వర్షాభావ ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాధారణంగా 9.54 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వరి ఈసారి 6.56 లక్షల ఎకరాలకే పరిమితమైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 8.13 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.54 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తంగా 40 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. నీటి కొరతతో సాగైన పంటలు సైతం ఎండిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మూడేళ్ల దాకా కోలుకోలేని పరిస్థితి
కరువు ప్రభావం ఒక్క పంట సీజన్‌తో ముగిసేది కాదు. పెట్టుబడి నష్టపోయిన రైతులు పాత అప్పులు తీర్చలేక, తదుపరి పంట కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భూగర్భ జలాలు తిరిగి పుంజుకోవడానికి సమయం పట్టడంతో బావులు, బోరుబావులపై ఆధారపడిన సాగు కూడా దెబ్బతింటోంది. పశుగ్రాసం కొరతతో పశువుల పెంపకం కష్టమవుతోంది. ఉపాధి కోసం ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వలసలు వెళ్లాల్సి వస్తోంది.
తీవ్ర కరువు ప్రభావం నుంచి రైతాంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడేళ్లు పట్టవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవడం, ప్రభుత్వ సహాయం అందడం, రుణాలపై వెసులుబాటు కల్పించడం వంటివి జరిగితేనే రైతులకు కొంత ఉపశమనం లభించనుంది. మరోవైపు కరువు కాలంలో పశుగ్రాసం కొరత ఏర్పడనుండగా.. మేత లేక రైతులు పశువులను తక్కువ ధరలకే అమ్మేసుకునే పరిస్థితి ఉంది.
తక్షణ సాయంగా రూ.150 కోట్లు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరువు తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల్లో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసి రూ. 150 కోట్లు మంజూరు చేసింది. పాలమూరు జిల్లాలోని మిడ్జిల్, నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలం, నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలాల్లో తక్షణ కరువు నివారణ పనులు చేపట్టడానికి సాయంగా అందించింది. దీంతో కరువు నివారణకు అధికారులు ఎలాంటి పనులు చేపడుతారని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సీఎం రేవంత్ పైనే ఆశలు
ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి వైపే రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పంటలు నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.25 వేలు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బ్యాంకుల ద్వారా పెట్టుబడి సాయం అందించాలని పేర్కొంటున్నారు. రైతులను ఆదుకునేందుకు తాత్కాలిక ఉపశమనాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి కరువు నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తలాపున కృష్ణమ్మ.. పొలాలకు అందని నీరు
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం శాసనూలు శివారులో సాగు చేసిన వరి పంట నీరందక ఎండిపోయిందని రైతు మేకల రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల కుడి కాల్వ ద్వారా నీరు అందుతుందనే భరోసాతో పది ఎకరాల్లో వరి సాగు చేశామని, అయితే ఆయకట్టు చివరి భూములకు నీరు చేరకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. కృష్ణానది సమీపంలోనే ప్రవహిస్తున్నా పొలాలకు సాగునీరు అందకపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందారు.
గట్టు మండలంలోనూ కరువు తీవ్రత రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. పది ఎకరాల్లో సాగు చేసిన కంది పంటకు నీరందక ఎండిపోతోందని ఆలూరుకు చెందిన రైతు ప్రతాప్ తెలిపారు. పంటను కాపాడుకునేందుకు ఇతర రైతుల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలను అరికట్టి, గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు.
కరువు సాయం ఇవ్వాలి :హెచ్. నర్సింహ, బిజ్వార్, ఉట్కూరు మండలం, నారాయణపేట జిల్లా
భూగర్భ జలాలు అడుగంటడంతో చేతికి వచ్చిన వరి ఎండిపోయింది. వచ్చిన పంట అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అప్పులు ఇచ్చిన వాళ్లకు, బ్యాంక్ అప్పులకు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు సాయం కింద ఎకరాకు 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలి. బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్డ్ చేసి, తిరిగి పంట రుణాలు ఇవ్వాలి. ఉపాధి ద్వారా కరువు పని రోజులు ఎక్కువ కల్పించి ఆదుకోవాలి.
అప్పు ఎలా తీర్చాలో.. : శివయ్య, రైతు, కేశంపేట, రేవల్లి మండలం, వనపర్తి జిల్లా
మూడెకరాల్లో వేసిన మినుముల పంట పూర్తిగా పాడైపోయింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పూత కాయ దశలోనే ఎండ వేడిమికి మాడిపోయింది. ఏడు నుంచి పది కింటాలు వచ్చే దిగుబడి ఈసారి మూడు కింటాలు కూడా రావడమే కష్టంగా ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.

