హాట్ టాపిక్‌గా కొండా సురేఖ వ్యవహారం.. ఏం జరగబోతుంది?

కలం, వరంగల్‌ బ్యూరో: గతంలో ఉన్న పరిస్థితుల్లో తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిరాధారమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని.. తన వ్యాఖ్యలతో ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే క్షమించాలని మాజీ మంత్రి సురేఖ (Konda Surekha)  గురువారం ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె ఇప్పుడు క్షమాపణలు కోరడం వెనుక ఆంతర్యమేమిటనేది అర్థం కావడంలేదు. అయితే.. కొన్నాళ్ల కింద కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు, ఆమె మంత్రి పదవి కోల్పోవడం, పార్టీతో సంబంధాలపై నెలకొన్న చర్చల నడుమ సురేఖ వ్యాఖ్యలకు ప్రాధాన్యం వచ్చింది. పాత వివాదానికి ముగింపు పలికే ప్రయత్నమా? లేక రాజకీయంగా కొత్త సమీకరణాలకు సంకేతమా? లేదా సురేఖ మళ్లీ గులాబీ గూటికి చేరుతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు చెప్పడమేంటి..?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయినప్పటికీ గతంలో ఆమె తీవ్రంగా విమర్శించిన నేతకు ఇప్పుడు క్షమాపణలు చెప్పడం విస్తృతంగా చర్చకు దారితీసింది. అప్పట్లో కేటీఆర్‌పై సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఇప్పుడు అదే అంశంపై ఆమె వెనక్కి తగ్గినట్లుగా క్షమాపణలు కోరడం ఆసక్తిని రేకెత్తించింది. వ్యక్తిగతంగా బాధ కలిగించి ఉంటే క్షమించాలని చెప్పడం ద్వారా గత వివాదానికి ముగింపు పలకాలని ఆమె అనుకున్నారా? లేక మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ కొనసాగుతోంది.

పదవి కోల్పోయిన తర్వాత..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో కీలక నేత అయిన సురేఖ, తన కూతురి వ్యాఖ్యలతో తలెత్తిన వివాదాల అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరుగుతోంది. అయితే.. ప్రస్తుతం కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం ద్వారా రాజకీయ వ్యూహంలో మార్పు ఉంటుందా? కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ తన ప్రాధాన్యాన్ని నిలబెట్టుకుంటారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

గులాబీ గూటికి తిరిగి వెళ్తారా?

గతంలో సురేఖ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ (పాత టీఆర్‌ఎస్‌)లోకి వెళ్లారు. తిరిగి 2018లో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం ద్వారా మళ్లీ గులాబీ గూటికి చేరుతారా? అనే ప్రచారం సోషల్ మీడియాలో తీవ్రంగా నడుస్తోంది. మరోవైపు, పార్టీ మార్పుపై ఆమె నిర్ణయం ఏమిటి? కాంగ్రెస్‌ అధిష్టానం సురేఖ వ్యాఖ్యలపై ఎలా వ్యవహరిస్తుంది? అనే అంశాలపైనా చర్చ జరుగుతోంది.

వరంగల్‌ రాజకీయాల్లోనూ ఉత్కంఠ

సురేఖ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా ఉండగా.. ఆమె తదుపరి అడుగులు ఉమ్మడి వరంగల్‌ రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తారా? పార్టీ నాయకత్వంతో సయోధ్యకు ప్రాధాన్యం ఇస్తారా? లేక భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఒకప్పుడు రాజకీయంగా తీవ్రంగా విమర్శించిన నేతకు ఇప్పుడు ఆమె క్షమాపణలు చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>