15 ఏళ్లుగా.. ఖమ్మం రిటైర్డ్ పోలీసుల పోరాటం!

కలం, ఖమ్మం బ్యూరో: ఒకప్పుడు ఖాకీ యూనిఫాంలో ప్రజల ప్రాణాలకు, శాంతిభద్రతలకు రక్షణగా నిలిచిన పోలీసులు (Khammam Retired Police) రిటైర్ అయి పదిహేనేళ్లు గడుస్తున్నా, నేటికీ పింఛన్లు, బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లాలో 1984లో అప్పటి పోలీసు అధికారి దినేష్ రెడ్డి హయాంలో పదిహేను మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఐదుగురికి ఎస్ఐలుగా పదోన్నతులు కల్పించారు.

ఆ తర్వాత 1990లో పరీక్షల్లో అర్హత సాధించి 1991లో శిక్షణకు వెళ్లారు. అక్కడి నుంచే వారి కష్టాలు మొదలయ్యాయి. ఓ ఎస్ఐ విషయంలో ఏడేళ్ల సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఆర్మీ, ఏపీఎస్పీ విభాగాల నుంచి సివిల్‌కు వచ్చిన వారికి తొలి రోజు నుంచే సీనియారిటీ లెక్కిస్తుండగా, మొదటి నుంచి సివిల్‌లోనే నిస్వార్థంగా సేవలందించినవారిని విస్మరించారు.

“డీమ్డ్ టు బి డిక్లేర్డ్” పేరుతో ఆలస్యం

ఏపీపీఎం రూల్స్ ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తయితే ప్రమోషన్‌కు అర్హత లభించాలి. కానీ, సీనియారిటీని కలపకపోవడంతో ఆ తర్వాత 1985, 1989, 1991, 1992 బ్యాచ్‌ అధికారులు వీరికంటే ముందే పదోన్నతులు సాధించారు. 1991లో ట్రైనింగ్ పూర్తయినా, ఏడాదిలో ఇవ్వాల్సిన ప్రొబేషన్‌ను 1996లో “డీమ్డ్ టు బి డిక్లేర్డ్” పేరుతో మరో ఏడేళ్ల పాటు ఆలస్యం చేయడంతో ప్రమోషన్ అవకాశాలను కోల్పోయారు.

పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతి ఏటా జరగాల్సిన డీఐజీ స్థాయి పరీక్షలను కేవలం 1983, 1990లో మాత్రమే నిర్వహించడంతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐలకు 70 శాతం, ర్యాంక్ ప్రమోటీవ్ ఎస్ఐలకు 30 శాతం పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా, వరంగల్ డీఐజీ కార్యాలయం తప్పిదాలతో రావాల్సిన ప్రమోషన్లు దక్కలేదు. హైకోర్టు ఆదేశించినా 1992లో పంపాల్సిన పత్రాలను 1996లో పంపడంతో 1991 బ్యాచ్ అధికారులు తీవ్రంగా నష్టపోయారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కూడా కొంతమందికి నోషనల్ సీనియారిటీ, ఇంక్రిమెంట్లు దక్కినా, అందరికీ అందలేదు.

జీవో ఉన్నా.. ఆచరణ లేదు

తెలంగాణ ప్రభుత్వం 2023లో జీవో నెం. 1351 జారీ చేసినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాకపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల ఖమ్మం వచ్చిన డీజీపీకి స్వయంగా తమ గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. 1991లో వరంగల్ రేంజ్ పరిధి నుంచి ట్రైనింగ్‌కు వెళ్లిన 84 మంది ఎస్ఐల్లో ఇప్పటికే 90 శాతానికిపైగా అధికారులు చనిపోయారు. మిగిలిన కొద్దిమంది రిటైర్డ్ ఎస్ఐలు జె. నర్సింహారెడ్డి, ఎండీ జమీల్ పాషా, ఇ. కృష్ణమూర్తి, ఎస్కే జానిమియా, బి. బాబురావు, ఎండీ యూసుఫ్, ఎండీ హకీం తదితరులు ఆశలను వదులుకోకుండా పోరాడుతున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వినతి

నోషనల్ సీనియారిటీ ఆధారంగా పేపర్ ప్రమోషన్లు మంజూరు చేసి, పెన్షన్ ప్రయోజనాలు, బకాయిపడ్డ రిటైర్మెంట్ బెనిఫిట్లను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. జీవిత చరమాంకంలో రోడ్డెక్కి పోరాడుతున్న కొద్దిమందికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవతతో స్పందించి, తక్షణమే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయాలని రిటైర్డ్ పోలీసులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>