బియ్యం అధిక ధ‌ర‌కు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయించే వ్యాపారులపై నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. అన్ని రిటైల్, హోల్‌సేల్ దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో కలిసి తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె బియ్యం ధరల నియంత్రణ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెల వరకు కిలో బియ్యం ధర రూ.55 నుంచి రూ.60 వరకు ఉండగా, ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో సైతం రూ.75 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం బియ్యం రకాలను బట్టి గరిష్ఠ విక్రయ ధరలను నిర్దేశించిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ/కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్‌ఆర్/తెలంగాణ సోనా రకం రూ.74, హెచ్‌ఎంటీ/జేఎస్‌ఆర్ రకం రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. ఈ ధరలకు సంబంధించిన ఫ్లెక్సీలను రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు తమ పరిధిలోని వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

అన్ని దుకాణాల్లో ధరల పట్టికలను వినియోగదారులకు కనిపించేలా ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రేషన్ డీలర్లు బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రేషన్ కార్డుదారులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఉద్దేశించిన విధంగా సన్నబియ్యం సరఫరా జరిగేలా చూడాలన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినా, లబ్ధిదారులకు తక్కువ పరిమాణంలో పంపిణీ చేసినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే రేషన్ దుకాణాల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. బియ్యం ధరల నియంత్రణ, అక్రమ నిల్వలు, బియ్యాన్ని పక్కదారి పట్టించే చర్యలపై నిరంతర నిఘా ఉంచాలని, వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. నిర్మల, ఆర్డీఓ నవీన్, , డి.సి.ఎస్.ఓ గంప శ్రీనివాస్, డి.ఎం రవి నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు అనుప్రియ, క్రిస్టినా, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>