కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ న్యూ శాయంపేట (Shayampet), హంటర్ రోడ్ సర్వే నెంబర్ 23లోని ప్రభుత్వ భూమి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ భూమిని కబ్జా చేయడంతో పాటు భూమిలో హనుమాన్ విగ్రహం ఏర్పాటు, ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, హనుమాన్ భక్తుల నిరసన, పోలీసుల రంగ ప్రవేశం, అరెస్ట్ వెరసి ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
అసలేం జరిగింది..?
హనుమకొండ నగరంలోని హంటర్ రోడ్డులో సర్వే నెం.23 మొత్తం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ఎవరికీ అసైన్డ్ కాలేదు. నాలుగు రోజుల కిందట ఈ భూమిలో హనుమాన్ విగ్రహం ప్రత్యక్షమైంది. తర్వాత రోజు ఆ విగ్రహం ధ్వంసం కావడం వివాదానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే విగ్రహం పెట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలనే కుట్ర చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. హంటర్ రోడ్డులోని న్యూ శాయంపేట ఏరియా కాజీపేట-వరంగల్ మెయిన్ రోడ్‌కు దగ్గర ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. గజం స్థలం రూ.40,000 నుంచి రూ.60,000 పైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో కబ్జారాయుళ్ల కన్ను భూమిపై పడినట్లు ప్రచారం జరుగుతోంది.
పొలిటికల్ డ్రామా?
న్యూ శాయంపేట సర్వే నెం.23లో జరుగుతున్నది భూ కబ్జా కాదు.. పక్కా పొలిటికల్ డ్రామా అనే విమర్శలున్నాయి. నాలుగు రోజుల కిందట రాత్రికి రాత్రే కొందరు ప్రైవేట్ వ్యక్తులు జేసీబీతో భూమిని చదును చేసి ప్లాట్లుగా మార్చి వెంచర్ పేరుతో అమ్మకానికి పెట్టే ప్లాన్ చేసినట్లు ప్రచారంలో ఉంది. దీంతో కబ్జారాయుళ్లు తెలివిగా హనుమాన్ విగ్రహం ఎత్తుగడ వేసినట్లు వినికిడి. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోకుండా ఉండటానికి, స్థానికుల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అక్కడ హడావుడిగా హనుమాన్ విగ్రహం పెట్టారనే వాదనలు సైతం ఉన్నాయి. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో భూమి స్వాధీనానికి వెళ్లగా హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసమై ఉండటం ఉద్రిక్తతకు దారి తీసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
భూ కబ్జా కేసు కాస్తా పూర్తిగా పొలిటికల్ ఫైట్‌గా మారింది. గత నాలుగు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. మొదటి రోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి స్పాట్‌కు వెళ్లి ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దుర్మార్గం. హనుమకొండ పేరే హనుమంతుడి పేరు మీద ఉంటే, ఇక్కడే హనుమంతుడికి అపచారం జరగడం కీడు. ప్రభుత్వమే శాంతి హోమం చేసి విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పూర్తిగా అధర్మ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ కబ్జా వెనుక బీఆర్ఎస్ మాజీ నేతలు, స్థానిక లీడర్ల హస్తం ఉందని, పదేళ్లు అధికారంలో ఉండి నకిలీ పట్టాలు సృష్టించారని, ఇప్పుడు మేం స్వాధీనం చేసుకుంటుంటే మతం ముసుగు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సురేఖ రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉందని, విగ్రహం పేరుతో కబ్జా చేయాలని చూస్తే ఊరుకోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
భూమి స్వాధీనం..
ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన భూమిని కాపాడారు. కాజీపేట తహసీల్దార్, సిబ్బంది, పోలీసుల సహకారంతో ఆ స్థలంలో వేసిన టెంట్ తీసేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూమిని స్వాధీనం చేసుకుని సరిహద్దులు పెట్టారు. ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

