దేశంలో బంగారం(Gold), వెండి(Silver) ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల వల్లే పెరుగుదల నమోదైందని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.3 వేలు పెరిగి రూ.1,31,500 చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,17,150గా ఉంది. వెండి ధర కూడా పరుగులు తీస్తోంది. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.10 వేలకు పైగా పెరిగి రూ.1,71,300కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 4,218 డాలర్ల వద్ద, వెండి ఔన్సు 54.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయంగా ప్రభావం
అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం సాగిన ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసిన తర్వాత గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ చలనం వచ్చింది. ఈ పరిణామంతో అమెరికా ఆర్థిక డేటా విడుదలకు మార్గం సుగమమైంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు దారితీయవచ్చనే అంచనాలు పెట్టుబడిదారులలో పసిడి(Gold) డిమాండ్ పెరగడానికి దోహదం చేశాయి.
అంతేకాక, డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, సెంట్రల్ బ్యాంకులు నిరంతరంగా బంగారం కొనుగోళ్లు కొనసాగించడం కూడా ధరల పెరుగుదీకి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ బలహీనమవుతుంటే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మారింది. అందుకే పెట్టుబడుదారులు పసిడివైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ పసిడి విలువ మరింత బలపడుతోంది. వెండి కూడా దాదాపు అదే ధోరణిని చూపుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీయల్ డిమాండ్ పెరగడం దీన్ని ప్రభావితం చేస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం లేకపోవడం, వడ్డీ రేట్లపై అనిశ్చితి, డాలర్ బలహీనత ఈ మూడు కారణాలు ప్రస్తుతం బంగారం, వెండి మార్కెట్ కదలికల దిశను నిర్ణయిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా పసిడి ధరలు మరింత ఎగిసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: ‘నన్ను దేశంలో సగం మంది చంపేయాలనుకున్నారు..’
Follow Us on: Youtube

