కలం, వెబ్డెస్క్: దేశ ప్రగతి పథంలో, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో జెనరేషన్ జీ యువత పాత్ర కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దేశంలోని వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, దేశాభివృద్ధిలో భాగమవ్వాలని జెన్ జీ (Gen Z) కు ప్రధాని పిలుపునిచ్చారు. ‘వీర్ బాల దివస్’ (Veer Baal Diwas) ను పురస్కరించుకొని శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. జెన్ జీ యువత ప్రతిభ, సామర్థ్యం, ఆత్మవిశ్వాసంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. కష్టపడడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం ద్వారా స్వీయ, కుటుంబం, సమాజానికి మేలు చేయడం అలవర్చుకోవాలన్నారు. ‘ దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో జెన్ జీ, జెన్ ఆల్ఫా కీలకం. మీ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మీపై నాకు అపార నమ్మకం ఉంది. హోదా, డబ్బు, వయస్సు కాదు.. పనులే మన గొప్పతనాన్ని నిర్ణయిస్తాయి. చిన్న వయస్సులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే మంచి పనులు చేయొచ్చు. తాత్కాలికంగా వచ్చే ప్రజాదరణ, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. దేశ నిర్మాణానికి కృషిచేసిన మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలి. మీ విజయం మీకే పరిమితం కాకుండా దేశ విజయంగా మారాలి’ అని యువతకు మోదీ పిలుపునిచ్చారు.
అవకాశాలున్నాయి.. అందుకోండి:
‘ఒకప్పుడు యువత ఏదైనా సాధించాలనే ఆశలను, కలలను కనడానికే భయపడే పరిస్థితి ఉండేది. అప్పటి పాత వ్యవస్థలు దీనికి కారణం. అవి ‘ఏమీ మారదు’ అనే ఆలోచనను కలిగించాయి. కానీ ఇప్పుడలా కాదు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో యువతలో నిరాశ, నిస్పృహ లేవు. మీకు అన్ని అవకాశాలూ అందుబాటులో ఉన్నాయి. మీ ప్రతిభను ఉపయోగించి వాటిని అందుకోండి. మీ కలలను సాకారం చేసుకోండి. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఖేలో ఇండియా వంటివి మీకోసమే ఉన్నాయి. మీ రంగాలను ఎంచుకొని ముందుకు సాగండి. వీర్ సాహిబ్జాదాలు చూపిన ఆత్మస్థైర్యం అలవర్చుకోండి’ అని ప్రధాని మోదీ (PM Modi) యువతను కోరారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ, ధైర్యం, తెగువ చూపిన యువతకు ‘వీర్ బాల పురస్కార్’లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు.
Read Also: సీఎం రేవంత్, కేటీఆర్ తిట్ల పురాణం
Follow Us On: Sharechat


