కలం, స్పోర్ట్స్ : ఇండియా క్రికెట్‌లో చిచ్చర పిడుగు ట్యాగ్ అందుకున్న వైభవ్ సూర్యవంశీని సెన్సేషన్ అనడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఫేమ్‌పై చేస్తున్న హడావుడిని తగ్గించాలని సూచించాడు. అప్పుడే వైభవ్ (Vaibhav Suryavanshi) ని క్రికెట్ సెన్సేషన్ అనడం తొందరపాటే అవుతుందని వివరించారు. అపార ప్రతిభ ఉన్నా, కెరీర్ ప్రారంభ దశలోనే లేబుల్స్ వేయడం యువ ఆటగాళ్లపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గత ఏడాది కాలంలో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి బంతికే సిక్సర్ బాది ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. మూడో మ్యాచ్‌లోనే 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. లిస్ట్–ఏ క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఘనత కూడా అతనికే దక్కింది. యూత్ వన్డేల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లపై నిలకడైన ఆటతో తన ముద్ర వేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ ముందు అతనిపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే జూనియర్ స్థాయిలో వచ్చిన విజయం, ఉన్నత స్థాయిలో కొనసాగుతుందనే హామీ లేదని గవాస్కర్ స్పష్టం చేశారు. “అండర్–19 క్రికెట్ నుంచి ఫస్ట్ క్లాస్ దాకా పెద్ద అంతరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ మరింత కఠినం. అందుకే ఇప్పుడే ఎవరినైనా సంచలనంగా పిలవడం తొందరపాటు” అని గవాస్కర్ తన మిడ్ డే కాలమ్‌లో రాశారు.
ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ అండర్–19 జట్టుపై భారత్ ఎదుర్కొన్న 191 పరుగుల పరాజయాన్ని ప్రస్తావిస్తూ, ఐపీఎల్ ప్రభావంతో కొందరు యువ బ్యాటర్లు అవసరానికి మించి దూకుడుగా ఆడారని గవాస్కర్ అన్నారు. టోర్నమెంట్ క్రికెట్‌లో క్రమశిక్షణ, పరిస్థితులకు తగ్గ ఆటే విజయానికి దారి చూపుతుందని ఆయన పేర్కొన్నారు. “జట్టు యువకులతో నిండి ఉంది. అనుభవం పరిమితమే. అందుకే సీనియర్ ఆటగాడు లేదా మెంటార్ హెచ్చరిక అవసరం. ఒక్క తప్పు డగౌట్‌కు పంపుతుంది. ఐపీఎల్ ఆలోచనలు పక్కన పెట్టి ట్రోఫీ గెలుపుపైనే దృష్టి పెట్టాలి,” అని గవాస్కర్ సూచించారు.
యూఎస్ఏతో మ్యాచ్‌లో రెండు పరుగులకే పరిమితమైన వైభవ్, బులావాయోలో బంగ్లాదేశ్‌పై 72 పరుగులతో గట్టిగా తిరిగి వచ్చాడు. ఈ విజయంతో భారత్ వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. మాజీ భారత మహిళల జట్టు కోచ్ డబ్ల్యూ.వి. రమణ్ కూడా ఐపీఎల్ వెంటనే అండర్–19 క్రికెట్ ఆడటం యువ ఆటగాళ్ల దీర్ఘకాల అభివృద్ధికి అడ్డంకిగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.


