Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గురువారం రెంజల్ ఎస్సై సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అయిదుగురు వ్యక్తులు మూడు బైకులపై వస్తూ.. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకుని, తనిఖీ చేయగా గన్ని బ్యాగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ ఉన్నాయి. వీరిని వనం సాయిలు, (మెదక్), జగన్నాథం సారయ్య (మెదక్), వనం పోశెట్టి, హన్మంతెకిడి, (బోధన్), ధనశ్రీ కిరణ్, (ఫతేనగర్, మెదక్), దాసరి పోచయ్య (నారాయణఖేడ్)గా గుర్తించారు.

నాలుగు జిల్లాల్లో దోపిడీ పర్వం..

ఈ అయిదుగురు ముఠాగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 64 ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ కాయిల్స్ దొంగతనం చేసినట్లు సీపీ సాయిచైతన్య వివరించారు. రెంజల్, బోధన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి , జక్రాస్‌పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో 38 ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనం చేశారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్ , భిక్నూర్, ఎల్లారెడ్డి , నాగిరెడ్డిపేట్, పెద్ద కొడపగల్ ప్రాంతాల్లో 20 ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ చేశారు. మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి ఏరియాలలో నాలుగు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రెండు కాపర్ కాయిల్స్ దొంగతనాలు చేశారు. ఇలా దొంగతనం చేసిన కాపర్ కాయిల్స్‌ను బోధన్, నిజామాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని స్క్రాప్ దుకాణాల్లో అమ్మేస్తున్నారు.

స్క్రాప్ దుకాణ యజమానులు అరెస్ట్..

అయిదుగురు నిందితుల నుంచి 80 కిలోల రాగి కాయిల్స్, 3 బైకులు, 4 మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. వీరితో పాటు కాపర్ కాయిల్స్ కొన్న స్క్రాప్ షాపుల యజమానులు సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేషేక్ మహబూబ్‌ను కూడా అరెస్టు చేశారు. మాలప్ప మాస్టర్, తాయప్ప దంగల్ అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసును ఛేదించిన బోధన్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీలు శ్రీనివాస్, మస్తాన్ అలీ, సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ సాయినాథ్, రెంజల్, బోధన్ రూరల్ ఎస్సై లు చంద్ర మోహన్, మచ్చేందర్ రెడ్డి , సీసీఎస్ ఎస్సై విట్టల్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాం, కానిస్టేబుల్స్ రవి, విశాల్, హెచ్‌పీఎల్ పార్టీ కానిస్టేబుల్ కృష్ణను సీపీ సాయి చైతన్య అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>