గజ్వేల్‌లో కాంగ్రెస్ నేత చేతివాటం.. గాంధీ భవన్ చేరిన పంచాయితీ!

కలం, మెదక్ బ్యూరో: గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ‌ ప‌రిధిలోని తూప్రాన్ మార్కెట్ క‌మిటీ ప్ర‌క‌ట‌న వివాదాస్ప‌దంగా మారుతుంది. పార్టీని న‌మ్ముకున్న నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను కాద‌ని …వ‌ల‌స వ‌చ్చిన వారికి ప‌దవులు దక్క‌డం పై తాడోపేడో తెల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు కాంగ్రెస్ నేతలు. గజ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి చేతివాటం వ‌ల్ల‌నే ప‌ద‌వులు రాలేద‌ని అరోపణ‌లు చేస్తూ గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్కారు సొంత పార్టీ నేతలు.

గుట్టు చ‌ప్పుడు కాకుండా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

తాజాగా మే 1 తేదీన తూప్రాన్ వ్య‌వ‌సాయ‌ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించింది ప్రభుత్వం. తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మొదటి నుంచి సీనియ‌ర్ నేత అయిన‌ శరణ్య భాస్కర్ రెడ్డికే వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా య‌మ‌జాల‌ కీర్తన విట్ట‌ల్ రెడ్డిని చైర్మ‌న్,వైస్ చైర్మ‌న్ గా మామిండ్ల క్రిష్ణను ప్ర‌క‌టించారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే 1వ తేదీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌భుత్వం నుండి క‌మిటీ పాల‌క‌మండ‌లి నియామ‌కం జ‌రిగితే …తెల్లారి 2వ తేదీ శ‌నివారం 9 గంట‌ల‌కే బాధ్య‌తల‌ స్వీక‌ర‌ణ‌, ప్ర‌మాణ స్వీకారం గుట్టుచ‌ప్పుడు కాకుండా పూర్తి చేశారు. ఈ ప్రకటనతో తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో విధేయులుగా ఉంటూ మూడు ద‌శాబ్దాలుగా కష్టపడి పని చేస్తున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చిన‌ వారికి పదవులు ఇవ్వ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

దీతో ఆగ్ర‌హించిన భాస్క‌ర్ రెడ్డి న‌ర్సారెడ్డి వ్య‌వ‌హారం వ‌ల్ల‌నే త‌న‌కు ప‌ద‌వి రాలేద‌ని ఆరోపిస్తున్నారు. తూప్రాన్ మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల‌ను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అమ్ముకున్నారని బహిరంగంగానే ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మాములుగా హంగు ఆర్భాటాల మ‌ధ్య చేసుకొనే వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ బాధ్య‌త స్వీక‌ర‌ణ‌, ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని ఎలాంటి అతిథులు లేకుండా ఆగ‌మేఘాల మీద పూర్తి చేయ‌డం భాస్క‌ర్ రెడ్డి అరోప‌ణ‌ల‌కు బ‌లం చేకుర్చేలా ఉన్నాయి.

గాంధీభ‌వ‌న్ కు చేరిన ర‌చ్చ‌…

గజ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా ఉన్న న‌ర్సారెడ్డి పార్టీని న‌మ్ముకున్న వారికి కాకుండా వ‌ల‌స వ‌చ్చిన వారి నుండి డ‌బ్బులు తీసుకొని చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ప‌దవుల‌ను అమ్ముకున్నాడ‌ని అరోపిస్తూ, త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై గాంధీ భవన్ వెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశాడు. అలాగే త‌న అనుచ‌రుల‌తో క‌లిసి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా పత్రాలతో సుమారు 50 మంది వెళ్లగా, తొందరపడొద్దని పీసీసీ చీఫ్ చెప్ప‌డంతో ఆగిపోయారు. ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహఆదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి నర్సారెడ్డితో త‌న‌కు అన్యాయం జరిగిందని వాపోయారు భాస్క‌ర్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తమపై కేసులు పెట్టిన వ్యక్తికే పదవి ఇస్తే ఇక పార్టీలో తామెందుకని ఆవేదన వెలిబుచ్చారట. అక్రమ కేసులను సైతం ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడితే చివ‌ర‌కు నామినేటేడ్ పోస్టులను సైతం డ‌బ్బులు తీసుకొని త‌మ‌ను మోసం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ట‌. గతంలోనూ, తాజాగా జ‌రిగిన నామినేటేడ్ పోస్టులను నియోజకవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి అమ్ముకున్నారని,వాటిపైన విచార‌ణ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లను కాంగ్రెస్ నాయ‌కులు కోరారు.

అన్ని వేళ్లు న‌ర్సారెడ్డి వైపే

బీఅర్ఎస్ అధినేత , స్ధానిక ఎమ్మెల్యే కేసీఆర్ పై గెల‌వాలంటే పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి గుర్తించి అవ‌కాశాలు ఇవ్వాల‌ని కానీ గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం అందుకు భిన్నంగా వసూళ్లకు అలవాటు ప‌డి నిజ‌మైన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌ని వాపోతున్నారు. నర్సారెడ్డి వ్య‌వ‌హార శైలి వ‌ల్ల‌నే గ‌జ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎద‌గ‌లేక‌పోతుంద‌ని, అందుకే కెసీఆర్ కు క‌నీస పోటీ కుడా ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌డు క్షేత్రస్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయాల్సింది పోయి పార్టీలో సీనియర్లను పట్టించుకోవడంతో లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నర్సారెడ్డి అవ‌లంబిస్తున్న విధానాల వ‌ల్ల గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం లోక‌ల్ క్యాడ‌ర్ కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ అభివృద్ది ,సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే విష‌యంలో న‌ర్సారెడ్డి విఫ‌లం అవుతున్నాడ‌ని చెబుతున్నారు. తాజాగా తూఫ్రాన్ మార్కెట్ క‌మిటీ ప‌దవుల కోసం ల‌క్ష‌ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని నేరుగా న‌ర్సారెడ్డినే టార్గెట్ చేసినా.. ఆయ‌న స్పందించ‌కపోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గజ్వేల్ లో పార్టీ తిరిగి పుంజుకుంటుందని కార్యకర్తలు ఆశపడితే, నర్సారెడ్డి చేస్తున్న నిర్వాకంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపడే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>