రీల్స్ పిచ్చిపై బీసీసీఐ సీరియస్.. కొత్త రూల్స్ ఇవే!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక గ్లామర్ ప్రపంచం. సినీ తారలు, మాజీ ప్లేయర్లు, ఫేమస్ కామెంటేటర్లు ఇలా చాలా మంది ఈ టోర్నీని చూడటానికి మైదానాలకు వస్తారు. వచ్చిన వాళ్లు కుదురుగా కూర్చుని మ్యాచ్ చూడకుండా కొందరు సోషల్ మీడియా రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. ఇదే విషయం బీసీసీఐ (BCCI) కంటపడింది. ఈ రీల్స్ పిచ్చి శృతిమించడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. 2026 సీజన్‌లో నిబంధనలు (IPL Rules) ఉల్లంఘిస్తున్న ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు సిద్ధమైంది. ఆటగాళ్లు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు మ్యాచ్‌కు సంబంధించిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా కొందరు మాజీ క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించి, ఆటగాళ్లు, అధికారులు ఉండే నిషేధిత ప్రాంతాల్లో (PMOA) వీడియోలు తీస్తున్నట్లు బోర్డు గుర్తించింది.

ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో డగౌట్ సమీపంలో వీడియో తీస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అలాగే అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో ఉన్న మరో మాజీ ఆటగాడు తన యూట్యూబ్ ఛానెల్ కోసం డగౌట్ వద్ద షూటింగ్ చేయడంతో బోర్డు హెచ్చరించింది. ఇలా బోర్డు దుస్తులు ధరించి మైదానంలో వీడియోలు తీసే వారికి లీగల్ నోటీసులు పంపాలని బీసీసీఐ భావిస్తోంది.

మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరుగుతుండటంతో ‘హనీ ట్రాపింగ్’ వంటి ముప్పుల నుండి ఆటగాళ్లను కాపాడేందుకు బోర్డు మార్గదర్శకాలను కఠినతరం చేసింది. మ్యాచ్ జరుగుతున్న రోజున, మ్యాచ్‌కు ముందు లేదా తర్వాత వీడియోలు పోస్ట్ చేయకూడదని ఆటగాళ్లకు స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు (IPL Rules) కేవలం ఆటగాళ్లకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయని బోర్డు తెలిపింది.

హోటల్ గదుల్లోకి అనధికారిక వ్యక్తులను తీసుకురావడంపై కూడా బీసీసీఐ నిఘా పెట్టింది. అవినీతి నిరోధక విభాగం (ACU) అధికారులు ప్లేయర్లకు ఇప్పటికే పలు సూచనలు చేసినప్పటికీ, కొందరు ఆటగాళ్లు హోటళ్లకు అతిథులను తీసుకువస్తున్నట్లు తేలింది. స్థానిక టీ20 లీగ్‌లలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం యువ క్రికెటర్లకు తప్పుడు సంకేతాలు పంపుతుందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. క్రమశిక్షణను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలను ఐపీఎల్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్ర స్థాయి టీ20 లీగ్‌లకు వర్తింపజేయాలని బీసీసీఐ నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని బోర్డు సంకేతాలు పంపింది.

Read Also: ప్రైజ్‌మనీ కోసం గ్రాండ్‌మాస్టర్ అభిజీత్ గుప్తా పోరాటం !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>