Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్యూచర్ సిటీ వివాదం.. ట్రబుల్‌లో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు

కలం, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన ‘ఫ్యూచర్ సిటీ’(Future City) వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన హరీశ్‌రావు, ఇప్పుడు తన వ్యాఖ్యలతోనే రాజకీయ ఇబ్బందులలో చిక్కుకున్నారనే చర్చ సాగుతోంది. అమెరికా పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారాయి.

అమెరికాలో జరిగిన సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును రద్దు చేస్తామని పేర్కొన్నారు. తిరిగి పాత ఫార్మా సిటీ ప్రాజెక్టును తీసుకొస్తామని చెప్పడం రాజకీయ వర్గాలలో  ప్రకంపనలు రేపింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సహా పలువురు నేతలు హరీశ్‌రావును టార్గెట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దన్నట్టుగా మాట్లాడుతున్నారని, యువత ఉపాధి అవకాశాలను ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యమా? అని ప్రశ్నించారు.

అయితే ఈ మొత్తం వివాదంలో ఆసక్తికర అంశం ఏమిటంటే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇప్పటివరకు స్పందించకపోవడం. హరీశ్‌రావు వ్యాఖ్యలు పార్టీ అధికారిక విధానమా? లేక ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో  వ్యక్తమవుతున్నాయి. పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా ఈ అంశంపై యాక్టివ్‌గా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జగిత్యాలలో జరిగిన సభలో కేసీఆర్ హైడ్రాపై వ్యాఖ్యానించినా, ఫ్యూచర్ సిటీ అంశాన్ని ప్రస్తావించలేదు. కేటీఆర్ కూడా ప్రభుత్వ విధానాన్ని విమర్శించినప్పటికీ, ప్రాజెక్టును రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో హరీశ్‌రావు ఒంటరిగా మిగిలిపోయారనే ప్రచారం ఊపందుకుంది. సూటి వ్యాఖ్యలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టే హరీశ్‌రావు (Harish Rao), ఈసారి చేసిన కామెంట్‌తో తానే రాజకీయంగా కార్నర్ అయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల విమర్శలకు ఆయన ఎలా సమాధానం ఇస్తారు? సొంత పార్టీ నుంచి మద్దతు లభిస్తుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

Read Also: మహిళా సాధికారత వారోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

Follow Us On: X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>