కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నట్లుగానే విద్యుత్ వినియోగం (Electricity Demand) రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. రాష్ట్రంలో రోహిణీ కార్తె ప్రవేశానికి ముందే ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. చాలా జిల్లాల్లో డే టైమ్ టెంపరేచర్ 46 డిగ్రీలు దాటింది. వడదెబ్బతో 16 మంది చనిపోయినట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. వేసవి తాపాన్ని అధిగమించడానికి ఇండ్లు, ఆఫీసుల్లో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఎన్నడూ లేనంతగా పెరిగింది. దీంతో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కరెంటుకు డిమాండ్ పెరిగింది.
విద్యుత్ వినియోగం ‘ఆల్ టైమ్ హై’ మార్కును తాకింది. ఒక్కసారిగా లోడ్ పెరిగితే ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పెరిగి మొరాయిస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ డిస్కమ్‌లు వాటి సామర్థ్యాన్ని దాదాపు 60% పెంచేలా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటివరకు విద్యుత్ కోతలు లేకపోయినా వానాకాలం పంటల సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వ్యవసాయ పంపుసెట్లు కూడా పనిచేయడం ప్రారంభిస్తే డిమాండ్‌కు తగిన సప్లై చేయడంపై అనుమానాలు మొదలయ్యాయి.
జాతీయ స్థాయిలో 270 గిగావాట్లతో రికార్డు బ్రేక్ :
తీవ్రమైన హీట్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగానే విద్యుత్‌కు డిమాండ్ (Electricity Demand) పెరిగింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం మే 21 మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లకు చేరింది. వారం రోజుల నుంచి విద్యుత్ వినియోగంలో పాత రికార్డులు బద్దలయ్యాయి. మే నెల 18న 257.37 గిగావాట్లు, 19న 260.45 గిగావాట్లు, 20న 265.44 గిగావాట్ల చొప్పున వరుసగా పెరుగుతూ మే 21 నాటికి అది 270 గిగావాట్లు దాటింది.
ఈ వేసవిలో (Summer) కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన 270 గిగావాట్ల గరిష్ట డిమాండ్ మార్కును దాటడం విశేషం. గతేడాది జూన్‌లో గరిష్టంగా విద్యుత్ డిమాండ్ 242.77 గిగావాట్లుగా నమోదైంది. దానితో పోలిస్తే ఈసారి వినియోగం భారీగా పెరిగింది. ఇంతటి భారీ డిమాండ్‌ను తట్టుకోవడంలో థర్మల్ పవర్ (62.8%) కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాతి స్థానం 22 శాతంతో సోలార్ పవర్‌దే (Solar Power).
తెలంగాణలోనూ 18 వేల మెగావాట్లు క్రాస్ :
దేశవ్యాప్త ట్రెండ్‌కు అనుగుణంగానే తెలంగాణలోనూ కరెంట్ వినియోగం మునుపెన్నడూ లేని స్థాయికి చేరింది. ఎండ తీవ్రత పెరగడం, అటు వ్యవసాయరంగానికి గృహావసరాలకు డిమాండ్ తోడవడంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు చరిత్రలోనే అత్యధిక సరఫరాను నమోదు చేశాయి. రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 18,228 మెగావాట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో నమోదైన 17,162 మెగావాట్ల రికార్డును ఈ సంవత్సరం మే నెల బ్రేక్ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఒక్కరోజే 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం నమోదైంది.
అంతకుముందు ఉన్న 335.19 మిలియన్ యూనిట్ల రికార్డు బ్రేక్ అయింది. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో కూడా రికార్డు స్థాయిలో 6,457 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్ వాడకాన్ని పరిశీలిస్తే గతేడాదికంటే దాదాపు 20% పెరిగింది. గరిష్ట స్థాయిలో 4,766 మెగావాట్ల డిమాండ్ రీచ్ అయింది. వాడకాన్ని గమనిస్తే అది 100 మిలియన్ యూనిట్లు దాటింది. రాష్ట్రంలోని మొత్తం డిమాండ్, వినియోగంలో దాదాపు మూడవ వంతు గ్రేటర్ పరిధిలోనే ఉన్నది.
ఏసీ, ఫ్యాన్ల వాడకంతో పెరిగిన డిమాండ్ :
నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గృహ, వాణిజ్య సముదాయాల్లో ఏసీలు, డిజర్ట్ కూలర్లు, ఫ్యాన్లు లాంటి వాడకం విపరీతంగా పెరిగినందున ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ (Electricity Demand) ఏర్పడింది. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ సమయాల్లోనే పీక్ డిమాండ్ నమోదవుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి సమయంలోనూ గాలిలో తేమ శాతం తేడాగా ఉండడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడక తప్పడంలేదు.
ఎండలు ఇంకా ముదిరే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో దేశీయ విద్యుత్ డిమాండ్ 275 గిగావాట్లను దాటొచ్చని, రాష్ట్ర డిమాండ్ కూడా ఇంకొంత పెరగొచ్చని విద్యుత్ ఇంజనీర్ల అంచనా. వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు టెక్నికల్‌గా అవసరమైన చర్యలపై విద్యుత్ సిబ్బంది ఫోకస్ పెట్టారు. దానికి తగినట్లుగా ముందస్తు ప్రణాళికలతో సన్నద్ధమయ్యాయి.
జాతీయ స్థాయిలో విద్యుత్ డిమాండ్ :
మే 18 : 257.37 గిగావాట్లు
మే 19 : 260.45 గిగావాట్లు
మే 20 : 265.44 గిగావాట్లు
మే 21 : 270.82 గిగావాట్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో :
మే 17 : 4,270 మె.వా. (88.89 మి.యూ)
మే 18 : 4,678 మె.వా. (99.04 మి.యూ)
మే 19 : 4,748 మె.వా. (100.53 మి.యూ)
మే 20 : 4,653 మె.వా. (99.12 మి.యూ)
మే 21 : 4,766 మె.వా. (100.83 మి.యూ.)
Read Also: ఫ్యూచర్ సిటీ వివాదం.. ట్రబుల్‌లో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు
Follow Us On: X (Twitter)

