కలం, వెబ్‌డెస్క్: రాచకొండ క్రైమ్ రిపోర్ట్-2025 లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నవాళ్లలో ఎక్కువమంది స్నేహితులే అని తేలింది. వీళ్లతోపాటు బంధువులు, ఇరుగుపొరుగువాళ్లు సైతం ఆడవాళ్ల పాలిట మృగాళ్లవుతున్నారు. హైదరాబాద్ నగరంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన రేప్ కేసుల వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సోమవారం రాచకొండ సీపీ సుధీర్ బాబు ‘రాచకొండ క్రైమ్ రిపోర్ట్-2025’ (Rachakonda Crime Report) విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది 330 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇందులో బాధితుల స్నేహితులపై 184, కుటుంబసభ్యులపై 37, ఇరుగుపొరుగువాళ్లపై 35, ఇతరులపై 70 కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసులను తప్పుడు ఆరోపణలుగా తేల్చారు. కాగా, మొత్తం అత్యాచార కేసులు గత ఏడాది (384)తో పోలిస్తే తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం.
అయితే, అదే సమయంలో మహిళల కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు పెరగడం భయపెడుతోంది. నిరుడు మహిళలు కిడ్నాప్ అయిన కేసులు 233 కాగా, ఈ ఏడాది 479. అలాగే లైంగిక వేధింపులపై నిరుడు 561, ఈ ఏడాది 809 కేసులు రికార్డయ్యాయి. పోక్సో కేసులు 2024లో 392 కాగా, 2025లో 516. ఇక, ఈ మూడింటిలో మొత్తం కేసులు నిరుడు 1186 కాగా, ఈ ఏడాది 1804. అంటే దాదాపు 4శాతం పెరిగాయి. అలాగే 2024లో వరకట్న హత్యలు/ఆత్మహత్యలు 21 కాగా, 2025లో 18గా నమోదయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు నిరుడు 61, ఈసారి 52. వేధింపులు/గృహ హింస కేసులు నిరుడు 1222, ఈ సంవత్సరం 782. కట్నం కాకుండా ఇతర కారణాలతో గత ఏడాది 19 మంది, ఈ సంవత్సరం 18 మంది మహిళలు హత్యకు గురయినట్లు రాచకొండ క్రైమ్ రిపోర్ట్-2025 (Rachakonda Crime Report) వెల్లడించింది.
Read Also: కిడ్నాపులు.. వేధింపులు పెరిగాయ్
Follow Us On: Instagram


