కలం డెస్క్ : కృష్ణా జలాలను (Krishna River Water) ఏపీ తరలించుకుపోవడంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao) ఘాటుగా ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతోనే ఏపీ జల దోపిడీ యధేచ్ఛగా సాగుతోందని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని మండిపడుతున్నారు. దీనికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revant Reddy), ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. రెండు పార్టీల తరఫున పాత డాక్యుమెంట్లు తెరమీదకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి మధ్య జరిగిన కరెస్పాండెన్స్ వివరాలను రెండు పార్టీల నేతలు బైటపెడుతున్నారు. లెక్కలను పరిశీలిస్తే బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతుంది.
బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కృష్ణా జలాల్లో (Krishna River Water) ఏపీ దోపిడీని పూర్తిగా అరికట్టలేకపోయింది. ఇరిగేషన్ శాఖ దగ్గరున్న లెక్కలను చూస్తే ఉమ్మడి రాష్ట్రంలోకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఎక్కువ నీరు తరలిపోయిందనేది స్పష్టమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాలంలో కృష్ణా బేసిన్‌లో తెలంగాణ భూభాగంలోకి 10,666 టీఎంసీల (TMC) నీరు వస్తే అందులో కేవలం 727 టీఎంసీలను మాత్రమే ఏపీ అక్రమంగా తరలించుకుపోయింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో 7,242 టీఎంసీల నీరు వస్తే అందులో దాదాపు 1,200 టీఎంసీలు ఆంధ్రకు అక్రమంగా డైవర్ట్ అయ్యాయి. ఇది ఆంధ్ర తన పరిమితికి మించి వాడేసుకున్న నీరు. చట్టబద్ధంగా దాని హక్కుగా వాడుకున్న నీటికి ఇది అదనం.
కేసీఆర్ ఆమోదంతో నీటి దోపిడీ డబుల్ :
తెలంగాణ ఏర్పడక ముందు కృష్ణా బేసిన్ నుంచి ఏపీకి రోజుకు సుమారు 4.1 టీఎంసీల చొప్పున నీరు డైవర్ట్ అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో డబల్ అయినట్లు ఇరిగేషన్ డిపార్టుమెంట్ లెక్కలు తేల్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పోతిరెడ్డిపాడు ద్వారా మాత్రమే నీటి తరలింపు జరిగితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమర్రి (KCC Lift), వెలిగొండ ద్వారా కూడా నీటి తరలింపు మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాలంలో కేవలం 47,850 క్యూసెక్కుల ప్రవాహంతో రోజుకు సగటున 4.1 టీఎంసీల నీరు తెలంగాణ నుంచి ఏపీకి డైవర్ట్ అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి ప్రవాహ వేగం 1.11 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. నీటి తరలింపు రోజుకు సగటున 9.6 టీఎంసీల మోతాదుకు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే నీటి తరలింపు రెట్టింపు అయింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు : (2004-2014)
కృష్ణా బేసిన్‌లోకి చేరిన నీరు : 10,666 టీఎంసీలు
హంద్రీ-నీవా (మల్యాల) ద్వారా నీటి డైవర్షన్ : లేదు
ముచ్చుమర్రి ద్వారా నీటి డైవర్షన్ : లేదు
పోతిరెడ్డిపాడు ద్వారా డైవర్షన్ : 727 టీఎంసీలు
తెలంగాణ నుంచి తరలిన మొత్తం నీరు : 727 టీఎంసీలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత : (2014-2023)
కృష్ణా బేసిన్‌లోకి చేరిన నీరు : 8,993 టీఎంసీలు
హంద్రీ-నీవా (మల్యాల) ద్వారా నీటి డైవర్షన్ : 234.25 టీఎంసీలు
ముచ్చుమర్రి ద్వారా నీటి డైవర్షన్ : 26.70 టీఎంసీలు
పోతిరెడ్డిపాడు ద్వారా డైవర్షన్ : 699 టీఎంసీలు
తెలంగాణ నుంచి తరలిన మొత్తం నీరు : 1200 టీఎంసీలు
తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో : (2024 జూన్ – 2025 మే వాటర్ ఇయర్)
కృష్ణా బేసిన్‌లోకి చేరిన నీరు : 1,605 టీఎంసీలు
హంద్రీ-నీవా (మల్యాల) ద్వారా నీటి డైవర్షన్ : 29.55 టీఎంసీలు
ముచ్చుమర్రి ద్వారా నీటి డైవర్షన్ : 3.5 టీఎంసీలు
పోతిరెడ్డిపాడు ద్వారా డైవర్షన్ : 241.12 టీఎంసీలు
తెలంగాణ నుంచి తరలిన మొత్తం నీరు : 274.15 టీఎంసీలు
Read Also: డీకే అరుణను టార్గెట్ చేసిన కవిత
Follow Us On: X(Twitter)


