కలం, వెబ్ డెస్క్ : సంక్షేమ శాఖలలో పెండింగ్ స్కాలర్షిప్ (Scholarships) బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఒకేసారి విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు స్కాలర్ షిప్ బకాయిలకు సంబంధించి రూ.365.75 కోట్లను అధికారులు విడుదల చేశారు. వీటీలో బీసీ సంక్షేమ శాఖకు రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.152.59 కోట్లు విడుదలయ్యాయి.
సోమవారం ప్రజాభవన్ లో ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం విద్యతోనే సమాజంలో సమూల మార్పులు వస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. కాగా, Scholarships బకాయిల విడుదలతో కాలేజీల యాజమాన్యంతో పాటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: మహా నగరంలో కైట్ ఫెస్టివల్.. ఏర్పాట్లపై సమీక్ష
Follow Us On: Instagram


