టీటీడీ(TTD) కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత వేగవంతం చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధర్మారెడ్డి(Dharma Reddy)ని సిట్ అధికారులు విచారించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో ఆయన బుధవారం ఉదయం హాజరై దాదాపు మూడు గంటలపాటు విచారణకు గురయ్యారని సమాచారం.
ధర్మారెడ్డి(Dharma Reddy) ఈవోగా ఉన్న సమయంలో నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. టీటీడీ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో తక్కువ ప్రమాణం గల నూనెలు కలిపినట్లు, ఆ నెయ్యి(Ghee) సరఫరా కాంట్రాక్టులలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నాణ్యతా నియంత్రణ విభాగం నివేదికలు, సరఫరా పత్రాలు, టెండర్ దరఖాస్తులు తదితర పత్రాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ధర్మారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. సరఫరాదారుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు, నాణ్యతా పరీక్షలు, ఫుడ్ ల్యాబ్ నివేదికలు, నెయ్యి సరఫరా ప్రక్రియపై ఆయనను సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం. అంతేకాకుండా, గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన్ను కూడా విచారించనున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ కేసు టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించే స్థాయిలో ఉండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సాక్ష్యాధారాలను సేకరించే ప్రక్రియను సిట్ వేగవంతం చేయగా, నెయ్యి సరఫరా కంపెనీలను కూడా ఒకొక్కటిగా విచారించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఢిల్లీ పేలుడు.. పూర్తి సహకారం అందిస్తామన్న సీఆర్పీఎఫ్
Follow Us on: Instagram

