దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు బాధ్యతలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఉగ్రవాద కోణంలో జరిగిందనే అనుమానాల నేపథ్యంలో ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరించడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడం, స్థానిక పోలీసులతో సమన్వయంగా అనుమానితుల కదలికలను విశ్లేషించడం వంటి దర్యాప్తు చర్యలను ప్రారంభించింది.
అమిత్‌షా అత్యున్నత భద్రతా సమీక్ష
భారీ పేలుడు(Delhi Blast) నేపథ్యంలో దేశ భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) మంగళవారం తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ తపన్ దేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, ఎన్ఐఏ(NIA) డీజీ సదానంద్ వంసత్ దాటే, జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మాహుతి దాడి అనుమానం
ఘటనలో ఉపయోగించిన ఐ20 కారుకు పుల్వామా దాడిలో వాడిన వాహనాలతో సారూప్యత ఉందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం రాత్రి పోలీసులు పహర్‌గంజ్, దర్యాగంజ్ ప్రాంతాల్లోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. హోటల్ రిజిస్ట్రర్లను పరిశీలించి, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఢిల్లీలో హై అలర్ట్ జారీ కాగా, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Read Also: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
Follow Us on: Youtube

