కలం, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా బొమ్మలరామారం మండలంలోని పలు వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ (Budida Bikshamaiah Goud ) శుక్రవారం సందర్శించారు. మండల పరిధిలోని నాగినేనిపల్లి, బొమ్మలరామారం, చీకటిమామిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి, అక్కడ రైతులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అక్కడి అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, మౌలిక వసతుల లేమితో రైతులు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు-తేమ పేరుతో జరుగుతున్న దోపిడీని తక్షణమే అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం లిఫ్టింగ్ చేసిన వెంటనే ఆలస్యం లేకుండా, వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు.
రైస్ మిల్లర్లందరూ కుమ్మక్కై, రైతులకు బస్తాకు ఇంత అని కోత పెడుతూ తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల నరసయ్య, సర్పంచులు జ్యోతి బీరప్ప, ఉమాదేవి శ్రీకాంత్, నాగరాజు, మాజీ సర్పంచులు ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, దామోదర్, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

