కలం, వెబ్ డెస్క్ : కొడుకులు పట్టించుకోకపోతే ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిచ్చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన హన్మకొండ (Hanamkonda) జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో జరిగింది. గ్రామానికి చెందిన పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కొడుకు ఓ కూతురు ఉన్నారు. రీసెంట్ గానే వెంకటేశ్వర్లు భార్య మరణించింది. ఇద్దరు కొడుకులు బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కూతురుకు గతంలోనే పెళ్లి చేశారు. అయితే వృద్ధాప్యం మీద పడటంతో వెంకటేశ్వర్లు తన పనులు కూడా తాను చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వెంకటేశ్వర్లు స్థానంలో వేరే పూజారిని గ్రామస్తులు నియమించారు.
కొడుకులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో వెంకటేశ్వర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వెంకటేశ్వర్లు స్వస్థలం భీమదేవరపల్లి మండలం కొప్పూర్. అక్కడి నుంచి 50 ఏళ్ల క్రితం పెంచికల్ పేటకు వలస వచ్చాడు. ఆ సమయంలో గ్రామస్తులు 4.38 ఎకరాల స్థలాన్ని వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఆ భూమిలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు వెంకటేశ్వర్లు. ఇప్పుడు కొడుకులు పట్టించుకోకపోవడంతో.. గ్రామస్తులు తనకు ఇచ్చిన భూమిని తిరిగి అదే ఊరికి రాసిచ్చేశాడు వెంకటేశ్వర్లు. ఈ నిర్ణయంపై అంతా షాక్ అవుతున్నారు.


