కలం, వెబ్ డెస్క్ : కంటి చూపులో ఒక్కసారిగా నల్లటి చుక్కలు (Eye Floaters) లేదా నూలు పోగుల్లాంటి ఆకారాలు కదులుతూ కనిపించడం చాలామందిని భయపెడుతుంది. ముఖ్యంగా ఆకాశం లేదా తెల్లటి స్క్రీన్ వైపు చూస్తే ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇవి ఎప్పుడు సాధారణమో, ఎప్పుడు ప్రమాద సూచనలో భాగమో తెలుసుకోవడం చాలా అవసరం.
నిపుణుల సూచనల ప్రకారం, కంటి లోపల ఉండే “విట్రియస్ జెల్” (Vitreous Gel)లో మార్పులు రావడం వల్ల ఇవి కనిపిస్తాయి. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రభ్ జోత్ కౌర్ తెలిపిన వివరాల ప్రకారం, ఇవి కంటి లోపల ఏర్పడే చిన్న చిన్న నీడలు మాత్రమే. పుట్టినప్పుడు గట్టిగా ఉండే ఈ జెల్ వయసు పెరిగేకొద్దీ ద్రవ రూపంలోకి మారి చిన్న చిన్న కణాలుగా విడిపోతుంది. ఈ కణాలు రెటీనాపై నీడలుగా పడటంతో మనకు చుక్కలు కదులుతున్నట్లు కనిపిస్తుంది. దీనిని “పోస్టీరియర్ విట్రియస్ డిటాచ్‌మెంట్”(PVD) అంటారు. ఇది సాధారణంగా 60 ఏళ్ల తర్వాత సహజంగా జరుగుతుంది.
అయితే వృద్ధులలో మాత్రమే కాదు.. మరికొందరిలో కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. అధిక మయోపియా లేదా మైనస్ పవర్ కళ్లజోడు ఉన్నవారు, గతంలో కంటి గాయాలకు గురైన వారు, కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కంటి లోపల వాపు ఉన్నవారిలో కూడా ఫ్లోటర్స్ కనిపించవచ్చు. సాధారణంగా ఇవి ప్రమాదకరమైనవి కావు. కాలక్రమేణా మెదడు వాటిని అలవాటు చేసుకుంటుంది. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్త అవసరం. అకస్మాత్తుగా చాలా ఎక్కువ చుక్కలు కనిపించడం, కంటిలో మెరుపులు రావడం, చూపు మసకబారడం లేదా కంటి ముందు తెర పడినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇవి “రెటీనల్ డిటాచ్‌మెంట్”(Retinal Detachment) వంటి తీవ్రమైన సమస్యలకు సంకేతాలు కావచ్చు. 40 ఏళ్లు దాటినవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.