కలం, నిజామాబాద్ బ్యూరో: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లా రైతాంగానికి బ్యాంకర్లు బాసటగా నిలవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఎల్ నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో పంట రుణాల రీషెడ్యూల్, రైతులకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన ఆర్థిక సహాయంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎస్.ఎల్.బీ.సీ జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత ప్రతీకూల పరిస్థితుల్లో రైతులకు బ్యాంకర్లు బాసటగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బ్యాంకర్లతో సమన్వయము పెంపొందించుకుని అర్హులైన రైతులకు సకాలంలో రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల పంపిణీ, అవసరమైన సహకారం అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు కొత్తగా పంట రుణాలు సకాలంలో అందజేసి, వారికి అండగా నిలవాలని సూచించారు. వర్షాభావం దృష్ట్యా యాసంగిలో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వరికి ప్రత్యామ్నాయంగా ఇతర అనువైన పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు పంట రుణాల రూపంలో ఆర్ధిక వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్.బీ.ఐ ప్రతినిధి రాములు, నాబార్డు డీడీఎం ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, వ్యవసాయ శాఖ ఏడీ వీరస్వామి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే.రాజు, అన్ని బ్యాంకుల జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

