కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో (BC Study Circles Stipend) పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల స్టైపెండ్ మొత్తాన్ని పెంచినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన విద్యార్థుల నెలవారీ స్టైపెండ్‌ను ప్రస్తుతం ఉన్న రూ.5,000 నుంచి రూ.7,000కు పెంచినట్లు తెలిపారు. వారికి ప్రతిఏటా అందించే బుక్ ఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచినట్లు వెల్లడించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలతో పాటు బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్‌మెంట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం ఫౌండేషన్ కోర్సులో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల నెలవారీ స్టైపెండ్‌ను రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచినట్లు వెల్లడించారు. ఈ పెంచిన స్టైపెండ్ ఈ నవంబర్ నెల నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మొదటిసారిగా పూర్వ విద్యార్థులకు పరీక్ష ద్వారా రీఎంట్రీ కల్పించి, స్టైపెండ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, వారి లక్ష్యాల సాధనకు ఆర్థిక చేయూత అందిస్తోందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రతి సంవత్సరం మెరిట్ ప్రాతిపదికన యువతీ యువకులకు ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించి.. వారు పూర్తి స్థాయిలో పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

