కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ బోధన ఆసుపత్రులలో, మెడికల్ కళాశాలలో, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని జిల్లా ఏరియా కమ్యూనిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల (Hospital Workers) కు జీతాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తనను పరామర్శించడానికి వచ్చిన కార్మికులతో ఆయన మాట్లాడుతూ.. కాల పరిమితి ముగిసిన ఏజెన్సీలను రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికుల కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరుతూ ఈనెల 12 నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కాంట్రాక్టు కార్మికులు సిద్ధమవుతున్నారని సురేష్ అన్నారు.
రాష్ట్రంలో ఎంతో కీలకమైన వైద్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల జీతభత్యాలు వారి సంక్షేమం పట్ల రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించకపోవడం బాధాకరమన్నారు. ఆసుపత్రులలో మూడేళ్ల కాల పరిమితితో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్(ఐహెచ్ఎఫ్ఎంఎస్) ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేసే విధానం అమలు జరుగుతుందని, ప్రస్తుతం నడుస్తున్న ఏజెన్సీలు 2024 జూలై మాసానికే ముగిసిందని అయినా వాటిని రద్దు చేయకుండా కాలక్షేపం చేయడం దుర్మార్గమన్నారు. ఐదేళ్లుగా ఆసుపత్రుల సామర్థ్యం పెరుగుతున్న కార్మికుల సంఖ్య మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే అనేక పర్యాయాలు అధికారులు, ప్రజాప్రతినిధులను విన్నవించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ కార్యాలయాలను దిగ్బంధించడం జరిగిందని అన్నారు. గత నెల 22వ తేదీన సమ్మె నోటీస్‌ను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని, అయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదన్నారు. అందుకే ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ కళాశాలలో ఆసుపత్రి కార్మికులు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకరం చుడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏజెన్సీలను రద్దు చేసి కార్మికులకు కనీస వేతన రూ.26 వేలకు పెంచాలని, పండగ జాతీయ ఆర్జిత సెలవులు ఇవ్వాలని, ఒక నెల జీతం బోనస్‌గా చెల్లించే విధంగా చర్యలు చేపట్టి ఆసుపత్రి కార్మికుల ఆందోళన విరమింప చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాయి ప్రకాష్, శ్రీనివాస్, రామకృష్ణ, విజయ మోహన్ రెడ్డి, ఉమర్, నరసింహ చిట్టెమ్మ అనసుయమ్మ, యాదమ్మ, కృష్ణమ్మ, లక్ష్మి, మాధవి, సుజాత, మన్నెమ్మ సావిత్రి, భీమమ్మ, తిరుపతమ్మ, వెంకటమ్మ, రాధ, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

