పోలీస్ సిబ్బందికి హెల్త్ యాప్: డీజీపీ సీవీ ఆనంద్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) తెలిపారు. ఫిట్ కాప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా సిబ్బంది కోసం ప్రత్యేకంగా హెల్త్ యాప్ డిజైన్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో పలువురు యాప్ డెవలపర్లు, టెక్ టీం, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. యాప్‌లో పొందుపరచాల్సిన ఆరోగ్య ప్రమాణాలు, అవసరమైన ఫీచర్లపై చర్చించి, టెక్ నిపుణులకు పలు సూచనలు చేశారు. ఫిట్ కాప్ కార్యక్రమానికి వచ్చే పదేళ్ల పాటు పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించేందుకు స్పాన్సర్ కూడా ముందుకొచ్చారని డీజీపీ వెల్లడించారు. రానున్న 40–45 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తామని వివరించారు.

అన్ని వివరాల నమోదు..

తెలంగాణ పోలీస్ శాఖ తీసుకురాబోతున్న హెల్త్ యాప్‌లో 90 వేల మంది సిబ్బంది ఆరోగ్య వివరాలు నమోదు చేయబోతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వారికి ఎత్తు, బరువు, బీపీ, మధుమేహం పరీక్షలు నిర్వహిస్తారు. అధికంగా ఆరోగ్య ముప్పు ఉన్న సిబ్బందిని గుర్తించి, వారికి కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్ చేసి అవసరమైన సలహాలు, సూచనలు కూడా అందిస్తారు. దీంతో వారి ఆరోగ్యం మెరుగుపడి.. ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని డీజీపీ తెలిపారు. ఫిట్ కాప్ కార్యక్రమంలో సిబ్బంది మానసిక ఆరోగ్య సంరక్షణ, ఫుడ్ ప్లాన్, వ్యాయామ సూచనలు కూడా ఉంటాయన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా చేయడమే ఫిట్ కాప్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>