కలం, వెబ్ డెస్క్: గుజరాత్ (Gujarat) బనాస్కాంతా జిల్లా వడ్గాం తాలూకాలోని నలాసర్ గ్రామంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. మూడు నెలల క్రితం ఓ యువకుడు కుక్క కాటుకు గురయ్యాడు. చికిత్స తీసుకోకపోవడంతో రేబీస్ లక్షణాలతో బాధపడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కూలీగా పనిచేస్తున్న అతడికి ముగ్గురు పిల్లలున్నారు. మూడు నెలల క్రితం రేబీస్ సోకిన కుక్క కరిచింది. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు. ఇటీవల అతనిలో తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. భార్యపై దాడి చేయడంతోపాటు, నాలుగు కాళ్లపై పరుగెత్తుతూ, కుక్క (Dog)లా అరుస్తూ భయానికి గురిచేస్తున్నాడు.
పరిస్థితి చేయి దాటడంతో కుటుంబ సభ్యులు అతడిని తాళ్లతో కట్టివేసి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కూడా తాళ్లు విప్పుకొని మంచం ఇనుప కడ్డీలను కొరికినట్లు, పెద్దగా కేకలు వేసి ఇతర రోగుల్లో భయాందోళన సృష్టించినట్లు వైద్యులు తెలిపారు. భద్రతా దృష్ట్యా ఆసుపత్రి సిబ్బంది అతడిని ప్రత్యేక గదిలో నిర్బంధించారు. ఈ ఘటనపై ఆసుపత్రి డీన్, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ సిబ్బందిని కూడా పిలిపించారు. చివరకు రక్త నమూనాలు సేకరించి చికిత్స కొనసాగిస్తున్నారు.


