కలం, వెబ్‌డెస్క్: భారతదేశానికి 77వ గణతంత్ర వేడుకలకు అతిథిగా రావడం తన జీవితానికి సరిపడే గొప్ప గౌరవం అని యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ (EU President) ఉర్సులా వాన్‌డర్ లేయెన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలసి వేడుకలు జరిగే ప్రాంగణానికి వచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బగ్గీలో రాష్ట్రపతిలో కలసి ప్రాంగణంలో తిరిగారు. సైనిక దళాల కవాతు, శకటాలు చూశారు. సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు.
సాధారణంగా ధరించే ప్యాంట్స్, సూట్స్‌కు భిన్నంగా.. భారతీయత ఉట్టిపడేలా, మెరూన్ రంగులో డిజైన్ చేసిన డ్రస్‌లో వేడుకలకు ఉర్సులా హాజరయ్యారు. ఈ సందర్బంగా భారత్‌కు రావడం, వేడుకలకు హాజరవడంపై ‘ఎక్స్’ వేదికగా వరుస ట్వీట్లతో తన అభిప్రాయం పంచుకున్నారు. వీడియోలు, ఫొటోలు షేర్ చేసుకున్నారు. భారత్‌కు రావడాన్ని గౌరవం భావిస్తున్నట్లు ఈయూ ప్రెసిడెంట్ (EU President) పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా ప్రపంచానికి ఇండియా, యూరోపియన్ యూనియన్ స్పష్టమైన సందేశం ఇస్తున్నాయన్నారు. ముఖ్యంగా అనేక అంశాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం, చర్చలు రెండు ప్రాంతాల అభివృద్ధికి కీలకమని చెప్పారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో EU జెండాలు, EU మిలిటరీ స్టాఫ్, ATALANTA, ASPIDES మెరైన్టైమ్ మిషన్ల జెండాలు ప్రదర్శించడం.. ఇండియా, ఈయూ మధ్య భద్రతా సహకారానికి శక్తిమంతమైన చిహ్నమని ఆమె అభివర్ణించారు. ఇది జనవరి 27న EU-భారత్ మధ్య భద్రతా, రక్షణ భాగస్వామ్య ఒప్పందం సంతకంతో మరింత బలపడనుందన్నారు. ఈ సందర్భంగా భారత్-యూరప్ మధ్య వాణిజ్యం, రక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ఉర్సులా దృష్టి పెట్టడం గమనార్హం.
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్’’ గా ఉర్సులా వాన్డర్స్ (Ursula Von der Leyen) చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ఒప్పందాల్లో ఒకటిగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో మార్పుల మధ్య ఈ భాగస్వామ్యం కొత్త శకానికి నాంది పలకడం గ్యారంటీ అంటున్నారు.
కాగా, రిపబ్లిక్ డే వేడుకల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలుపుతూ ఉర్సులా హిందీలో కూడా ట్వీట్ చేశారు. ‘రిపబ్లిక్ డే సందర్భంగా మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాష్ట్రపతి గారూ. మీ స్నేహపూర్వక స్వాగతానికి హార్థిక ధన్యవాదాలు’ అని అందులో ఆమె పేర్కొన్నారు.
Read Also: 30% సూసైడ్స్.. IIT కాన్పూర్ లో ఏం జరుగుతోంది?
Follow Us On: Sharechat


