కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మొగనుంది. దీంతో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధుల్లో సందడి నెలకొంది. ఒకే విడతలో ఎలక్షన్స్ (Municipal Elections) నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేయడంతో పార్టీలు, ఆశావహులు రంగంలోకి దిగి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అర్హతలు, నిబంధనలు, వ్యయ పరిమితికి సంబంధించిన వివరాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో పోటీచేయడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల (Eligibility) కు సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Municipal Elections Eligibility | మున్సిపాలి లేదా కార్పొరేషన్ లలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. మున్సిపాలిటీలో పోటే చేసేవారు ఏదైన వార్డులో ఓటు హక్కు కలిగి ఉండాలి. కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసేవారు సదరు కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
ప్రభుత్వ కాంట్రాక్టర్లు, లాభదాయక పదవుల్లో ఉన్నవారు.. గతంలో ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించని కారణంగా అనర్హతకు గురైన వారు పోటీ చేయడానికి అనర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసు నుంచి తొలగించి ఉంటే పోటీ చేయడానికి అవకాశం ఉండదు. అప్పులు చెల్లించలేక దివాలా తీసినట్లు ప్రకటించబడిన వారు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పోటే చేసే అభ్యర్థికి కావాల్సినవి..
రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వారు పార్టీ నుంచి అధికారిక టికెట్ అంటే బీ ఫామ్ (B – Form) పొంది ఉండాలి. బలపరిచే వ్యక్తి ఒక్కరు ఉన్నా సరిపోతుంది. కానీ, స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేసేవారు 10 మంది ఓటర్లు (Proposer) మద్ధతు తెలుపుతూ ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ల సమయంలో నామినేషన్ ఫారమ్, అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
మున్సిపాలిటీల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇతరు రూ.2,500 చెల్లించాలి. కార్పొరేషన్లలో బరిలో దిగాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 2,500, ఇతరులకు రూ.5000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాన్ని నామినేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.


