కలం, నిజామాబాద్ బ్యూరో: ఎల్ నినో ప్రభావం (El Nino impact)తో ఈసారి వర్షాలు తక్కువగా కురుస్తాయని, వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రధానంగా వ్యవసాయంపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెబుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా నీటి యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంపై నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి (Veeraswamy) కలం ప్రతినిధితో మాట్లాడుతూ అన్నదాతలకు కీలకమైన సూచనలు, సలహాలు పంచుకున్నారు.
ఎల్ నినో వేళ రైతులకు ముఖ్య సూచనలు..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆలస్యమైనా రైతులు ఆందోళన చెందవద్దని, పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు పద్ధతులు మార్చుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తెలిపారు.
పంటల ప్రణాళిక
జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, ఆ తర్వాత వర్షాలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
సేద్యపు కుంటలు
వర్షపు నీటిని నిల్వ చేసుకుని పంటలను కాపాడుకోవడానికి వీలుగా రైతులు తమ పొలాల్లో తప్పనిసరిగా సేద్యపు కుంటలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ పంటలు
ముఖ్యంగా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట సాగుకు బదులుగా, నీటి ఎద్దడిని తట్టుకునే కంది, కొర్రలు, సజ్జలు లాంటి మంచి దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. అందుబాటులో ఉన్న నేల తేమ, వాతావరణ పరిస్థితులను అనుసరించి ముందస్తు యాసంగి పంటలు సాగు చేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకొని వర్షాభావం వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
జూలై 15 వరకు వర్షాలు లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒకవేళ జూలై 15 వ తేదీ వరకు వర్షాలు కురవకపోతే పొడి నేలల్లో తొందరపడి విత్తనాలు వేయవద్దని వీరాస్వామి హెచ్చరించారు. తేలిక నేలల్లో 50 నుండి 60 మి.మీ., బరువైన నేలల్లో 60 నుండి 75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే, అది కూడా 7 రోజుల్లోపు విత్తనాలు వేయాలన్నారు. పత్తి, మక్కజొన్న, కంది పంటల్లో సాధారణ సాగు కొనసాగించవచ్చని, అయితే మొక్కల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 10 శాతం ఎక్కువ విత్తన మోతాదు ఉపయోగించాలని చెప్పారు. మొలకలు రాని చోట వెంటనే గ్యాప్ ఫిల్లింగ్, అంటే మొక్కలు చనిపోయిన చోట తిరిగి విత్తడం చేయాలన్నారు. నేలలో తగినంత తేమ వచ్చే వరకు ఎరువుల వాడకం వాయిదా వేయాలని, అంతరకృషి ద్వారా నేల తేమను కాపాడుకోవాలని సూచించారు. అలాగే రెండు శాతం యూరియా మరియు ఒక శాతం పొటాషియం నైట్రేట్ ద్రవణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు నుండి మూడు సార్లు పంటలపై పిచికారీ చేయాలన్నారు.
జూలై 30 వరకు వర్షాలు లేకపోతే..
ఒకవేళ జూలై 30 వరకు కూడా వర్షాలు లేకపోతే, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేందుకు ఒక సాలు వదిలి ఒక సాలుకు తడులు ఇవ్వాలని వివరించారు. సాగు నీటి సరఫరా కోసం బోదెలు, కాలువలు, వెడల్పాటి మడులు కాలువల పద్ధతులను అనుసరించాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరి, మక్కజొన్న మరియు ప్రత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కంది, సజ్జ మొదలగు పంటలను వేసుకోవడం మంచిదని సూచించారు.
ఆగస్టు 15 వరకు ఆలస్యమైతే
వర్షాలు రావడం ఆగస్టు 15 వరకు ఆలస్యమైతే వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా తప్పనిసరిగా కంది, కొర్రలు వంటి పంటలను మాత్రమే ఎంచుకోవాలని స్పష్టం చేశారు. కంది పంట సాగు చేసినట్లయితే విల్జ్ అంటే ఎండు తెగులును తట్టుకునే మధ్యకాలిక రకాలను మాత్రమే ఎంచుకోవాలని రైతులకు సూచించారు.
రైతులకు విజ్ఞప్తి
ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమైనా రైతులెవరూ భయపడవద్దని వీరాస్వామి విజ్ఞప్తి చేశారు. తక్కువ నీటితో పండే పంటలు, అంతరపంటలు మరియు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలు పాటించి పంట నష్టాలను తగ్గించుకోవాలని కోరారు. వాతావరణాన్ని బట్టి పంట ఎంపిక చేసుకోవడమే రైతుకు ఎల్లప్పుడూ లాభదాయకమని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో పంటల సాగు ప్రణాళిక ఇలా:
వరి – 4 లకల 30 వేల ఎకరాలు
మొక్కజొన్న – 50 వేల ఎకరాలు
సోయాబీన్ – 37 వేల ఎకరాలు
పసుపు – 20 వేల ఎకరాలు
ఉద్యాన పంటలు – 20 వేల ఎకరాలు
మొత్తం – 5 లక్షల 57 ఎకరాలు

