కలం, నిజామాబాద్ బ్యూరో: పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ “సర్” (SIR) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ (Nizamabad SIR Voter List Revision) ప్రక్రియ అమలు విధానాన్ని వివరిస్తూ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లాలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తుందని తెలిపారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్ల పేరును జాబితాలో చేర్చడం కోసమే ఎస్ఐఆర్ అమలు జరుగుతోందని అన్నారు.
90 శాతం ప్రీ-మ్యాపింగ్ పూర్తి..
ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 90 శాతం ప్రీ-మ్యాపింగ్ పూర్తయ్యిందని, అర్బన్ సెగ్మెంట్ లో 68 శాతం జరిగిందని వివరించారు. జూన్ 25 నుండి క్షేత్రస్థాయిలో జరుగనున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరపాలని, ప్రతి ఓటరు తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకునేలా చొరవ చూపాలని అన్నారు. ఎస్ఐఆర్ అమలులో బీఎల్ఓలతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కూడా అత్యంత క్రియాశీలకం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 15 నుండి 24వ తేదీ లోపు బీఎల్ఏలు, బీఎల్ఓలకు ఎస్ఐఆర్ అమలు తీరుపై ఆయా ప్రాంతాల వారీగా శిక్షణా తరగతులను సైతం నిర్వహించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా ఓటరు జాబితా విషయమై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, కేవలం బీఎల్ఏలు మాత్రమే వాటిని తెలియజేయాల్సి ఉంటుందని.. వారి నుండి వచ్చే క్లెయిములు, అభ్యంతరాలను మాత్రమే స్వీకరించడం జరుగుతుందన్నారు.
ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ..
దీనిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకుని, నిర్ణీత ఫార్మాట్ లో వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల (జూన్) 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు పేరుతో ముద్రితమై ఉండి, క్యూఆర్ కోడ్ కలిగిన ఎన్యుమరేషన్ ఫారంలను అందజేస్తారని, ప్రతి ఓటరు తప్పనిసరిగా ఆ ఫారంలో వివరాలను పూరించి తిరిగి బీ.ఎల్.ఓలకు అందించేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ కోసం ఇంటికి వచ్చే బీఎల్ఓలు, సూపర్వైజర్లకు ప్రజలు సహకరించేలా చూడాలని అన్నారు. బీఎల్ఓలు పక్కాగా ప్రతి ఇంటిని తప్పనిసరి సందర్శించేలా ఆన్ లైన్ యాప్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
బీఎల్ఓలకు బీఎల్ఓలు సహకరించాలి..
ఇళ్ళ సందర్శన విషయంలో బీఎల్ఓలకు బీఎల్ఓలు సహకరించేలా చూడాలన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఎల్ఓల నుండి ఓటీపీలు తీసుకుని బీఎల్ఏలు ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టకూడదని, ఇలా చేయడం నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. ఇలా చేసినందుకు సంబంధిత బీఎల్ఓ, బీఎల్ఏలు శిక్షార్హులు అవుతారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని, జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అక్కడ సంతృప్తి చెందని పక్షంలో పక్షం రోజుల అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి అభ్యంతరాలు తెలుపవచ్చని సూచించారు. దాఖలైన అభ్యంతరాలు, క్లెయిములను సెప్టెంబర్ 28 వరకు పరిష్కారం చేస్తామని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

