కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాలపై మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అకస్మాత్తుగా సోదాలు (ED Raids I-PAC) నిర్వహించారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని ఐ-ప్యాక్ కార్యాలయాల్లోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఐకియా సమీపంలో ఉన్న సంస్థ కార్యాలయానికి చేరుకున్న అధికారులు, ఉదయం నుంచే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
గతంలో పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) జరిగిన సోదాలకు కొనసాగింపుగానే ప్రస్తుతం ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ సోదాల్లో (ED Raids I-PAC) కీలక పత్రాలతో పాటు డిజిటల్ ఆధారాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత కలిగిన ఈ సంస్థపై ఆకస్మికంగా దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బొగ్గు కుంభకోణం సెగ..
ఐ-ప్యాక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్‌కు సుమారు రూ.2,742 కోట్ల భారీ బొగ్గు కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రాథమికంగా గుర్తించింది. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించి, ఐ-ప్యాక్ సంస్థ కార్యకలాపాల కోసం వినియోగించినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల మళ్లింపుపై పక్కా ఆధారాలు సేకరించిన అధికారులు, దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 8వ తేదీన కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మరియు లౌడన్ స్ట్రీట్ ప్రాంతాల్లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ డేటా ఆధారంగా ప్రతీక్ జైన్ పాత్రపై విచారణ కొనసాగుతోంది.
Read Also: పిల్లల్లో స్క్రీన్ టైమ్ పెరిగితే ఆటిజం వస్తుందా?
Follow Us On: X(Twitter)

