కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (Devireddy Sudhir Reddy) మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో దోమతెరతో కుట్టించిన గౌన్‌తో ఆయన వినూత్న నిరసన ప్రదర్శించి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు (Hyderabad Mosquito Issue) పడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయంలో నాలుగు, ఐదు సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకునే వాళ్ళమని చెప్పారు. దోమలపై ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీని ద్వారా డెంగ్యూ, మలేరియాతో పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. దోమలు అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. దోమల బెడదపై అసెంబ్లీ మీడియా హాల్లో దోమ తెరతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మార్షల్స్ అడ్డుకున్నారని తెలిపారు.
హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం చేశారని దేవిరెడ్డి (Devireddy Sudhir Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల బెడదకు భయపడి ఎవరూ హైదరాబాద్ రావడం లేదన్నారు. హైదరాబాద్‌లో దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. మార్షల్స్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రతి డివిజన్‌కు 10 ఫాగింగ్ మిషన్‌లు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు దోమ తెర కుట్టించుకునే పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు. కరోనా వచ్చినప్పుడు మాస్క్ ఎలా పెట్టుకున్నామో, హైదరబాద్‌లో దోమల బెడద తట్టుకోలేక దోమ తెర కుట్టించుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
Read Also: ఐ-ప్యాక్ పై ఈడీ మెరుపు దాడులు: ఒకేసారి మూడు నగరాల్లో..
Follow Us On : WhatsApp

