కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల చేతిలో ఫోన్ ఉండటం చాలా సాధారణ విషయం అయిపోయింది. మాట వినకపోయినా, అన్నం తినకపోయినా, గోల చేస్తున్నా.. అన్నింటికి ఈ తరం తల్లిదండ్రుల మంత్రం ఫోన్ చేతిలో పెట్టేయడం. ‘ఐప్యాడ్ జనరేషన్’ అని పిలవబడే ఈ చిన్నారులు రోజంతా స్క్రీన్లకే అతుక్కుపోతుండటం వల్ల వారిలో మాటలు ఆలస్యమవ్వడం, సామాజిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు ఫోన్లకు అలవాటు పడటం వల్ల వారికి ఆటిజం (Autism in Children) వంటి సమస్యలు వస్తాయా అన్న ఆందోళన చాలా మంది తల్లిదండ్రులలో నెలకొంది. దీనిపై గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రఫత్ త్రివేది స్పందిస్తూ.. కేవలం స్క్రీన్ టైమ్ వల్ల ఆటిజం రాదని స్పష్టం చేశారు. ఆటిజం అనేది ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల, మెదడు అభివృద్ధి చెందే సమయంలో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తుందని ఆయన వివరించారు.
అయితే, జీవితంలోని మొదటి రెండు మూడు ఏళ్లలో అతిగా ఫోన్లు చూడటం వల్ల పిల్లల్లో మాటలు ఆలస్యమవ్వడం, ఇతరులతో కలవలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. పిల్లలు సాధారణంగా ఎదుటివారి కళ్లలోకి చూడటం, ముఖ కవళికలు, ఆటల ద్వారా విషయాలు నేర్చుకుంటారని, ఫోన్లలో మునిగిపోవడం వల్ల ఆ నేర్చుకునే ప్రక్రియ ఆగిపోతుందని డాక్టర్ పేర్కొన్నారు. పిల్లల్లో ఈ మార్పులు స్క్రీన్ వల్ల వచ్చాయా లేదా ఆటిజం (Autism in Children) వల్లే వచ్చాయా అని గుర్తించడం సులభమని ఆయన తెలిపారు. ఒకవేళ స్క్రీన్ చూడటం తగ్గించి, పిల్లలతో సమయం గడిపినప్పుడు వారిలో వేగంగా మార్పు వస్తే అది కేవలం స్క్రీన్ ప్రభావమేనని, ఒకవేళ మార్పు రాకుండా అదే ప్రవర్తన కొనసాగితే మాత్రం వైద్య సహాయం అవసరమని సూచించారు.
రెండేళ్లలోపు పిల్లలకు వీడియో కాల్స్ తప్ప వేరే ఇతర స్క్రీన్లను చూపించకూడదు. రెండేళ్లు దాటిన వారికి రోజుకు ఒక గంట కంటే తక్కువ సమయం మాత్రమే అనుమతించాలి, అది కూడా పెద్దల పర్యవేక్షణలో ఉండాలి. పిల్లలతో మాట్లాడటం, కథలు చెప్పడం, బోర్డ్ గేమ్స్ ఆడటం, ఇంటి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయడం వంటివి చేయాలి. పిల్లలు ఇతరులతో కలిసేలా, బయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలు పిలిచినా పలకకపోయినా, కళ్లలోకి చూసి మాట్లాడకపోయినా వెంటనే పీడియాట్రిషియన్‌ను సంప్రదించాలని డాక్టర్ త్రివేది సూచించారు. తల్లిదండ్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On : WhatsApp

