కలం, తెలంగాణ బ్యూరో : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 27న జరిగే ప్లీనరీ ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందనేది సస్పెన్స్‌గా మారింది. యధావిధిగా ఈ నెల 27న ప్లీనరీ జరపాలని తొలుత పార్టీ నాయకత్వం భావించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా బీఆర్ఎస్ ప్లీనరీ (BRS Plenary) జరపడానికి ఏర్పాట్లతో పాటు ప్రస్తావించాల్సిన అంశాలపైనా ఇటీవలే పార్టీ అధ్యక్షుడి సమక్షంలో చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో మే 6వ తేదీకి వాయిదా పడినట్లు పార్టీ నాయకుల సమాచారం. వరంగల్ జిల్లాలో మే 6న భారీ బహిరంగసభ నిర్వహించే వేదికగానే పార్టీ ప్లీనరీ ఉండొచ్చని సంకేతాలిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నది.
పార్టీ విజయాలను ప్రస్తావించాలని ప్లాన్ :
పార్టీ ప్లీనరీ (BRS Plenary) సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే టీఆర్ఎస్ పార్టీగా ఉద్యమం చేసింది మొదలు పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ఎక్కువగా ప్రస్తావించాలని పార్టీ దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తికావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రస్తావించి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ పరిస్థితుల్ని ఎలా అధిగమించిందీ, దానికి చేసిన శ్రమను గురించి వివరించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లేదా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కంటే బీఆర్ఎస్ చేసిన గొప్ప పనులనే వివరించాలనుకుంటున్నది. ఒక్కో రంగాన్ని ఉదహరిస్తూ గతంలోని, ప్రస్తుత పరిస్థితుల్ని జనానికి అర్థమయ్యే తీరులో చెప్పాలనుకుంటున్నది.
కవిత పార్టీ ప్రకటనతోనే వాయిదా? :
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త రాజకీయ పార్టీని ఈ నెల 25న లాంఛనంగా అనౌన్స్ చేయబోతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండా, ఎజెండాను కూడా ఆమె వివరించనున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే బీఆర్ఎస్ ప్లీనరీ వస్తుండడంతో హడావిడిగా నిర్వహించడం కంటే మే నెల ఫస్ట్ వీక్‌కు వాయిదా వేయడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కవితను నేరుగా ప్రస్తావించకుండా ఆమె కామెంట్లకు ప్లీనరీ వేదికగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కౌంటర్ ఇచ్చే అవకాశమున్నది. దాదాపు సంవత్సరం పాటు కవిత పేరును ప్రస్తావించని KTR ఇటీవల మంచిర్యాలలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా లేవనెత్తారు. కేసీఆర్ ఇప్పటివరకూ కవిత గురించిన ప్రస్తావనే చేయలేదు. దీంతో ఆమె పార్టీ పేరు, జెండా, ఎజెండా బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్లీనరీలో ఎలాంటి చర్చ జరుగుతుందనే ఆసక్తి కూడా నెలకొన్నది.
Read Also: పాత చింతకాయ పచ్చడిలా.. కేసీఆర్ ప్రసంగం: ఎమ్మెల్యే వేముల
Follow Us On: X(Twitter)

