కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రానైట్ (Karimnagar Granite) వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. క్వారీల నిర్వహణతో పాటు గ్రానైట్ కట్టింగ్ పరిశ్రమలు, మార్బుల్స్, టైల్స్ రవాణాలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారుల అవతారమెత్తి నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. గతంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.749 కోట్ల ఫెనాల్టీ చెల్లింపు కేసు ఇంకా తేలలేదు. ఏడాది కిందట లీజు గడువు ముగిసినా నడుస్తున్న క్వారీల గట్టు బయలయ్యింది. తాజాగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, జీఎస్టీ పన్నులు ఎగవేస్తూ మోసాలకు పాల్పడిన విషయం తెరపైకి వచ్చింది. కాగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా సాగుతున్న గ్రానైట్ అక్రమ రవాణా బాగోతాన్ని డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు బట్టబయలు చేశారు.
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికల ఆధారంగా రంగంలోకి దిగిన DGGI.. ఒక భారీ నెట్ వర్క్ ను ఛేదించింది. నకిలీ ఈ-వే బిల్లులు, డమ్మీ కంపెనీల పేరిట కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ముఠా గుట్టు రట్టయింది.రూ.80 నుండి 100 కోట్ల విలువైన ఈ-వే బిల్లులను క్రియేట్ చేసినప్పటికీ, జీఎస్‌టీ రిటర్న్స్ లో మాత్రం వీటి వివరాలను పూర్తిగా దాచిపెట్టారు. నిల్ (Nil) రిటర్న్స్ దాఖలు చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16.96 కోట్ల మేర జీఎస్‌టీని ఎగవేసినట్లు DGGI నిర్ధారించింది.
డమ్మీ సంస్థ పేరిట సిండికేట్ దందా
కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు సాగుతున్న అక్రమ గ్రానైట్ దందాపై DGGI అధికారులు ఉక్కుపాదం మోపారు. CGST యాక్ట్ సెక్షన్ 132(1)(a), సెక్షన్ 69 కింద ఆసిఫ్ నగర్, కరీంనగర్‌కు చెందిన శ్రీకాంత్ దాసరి అనే ప్రధాన నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో అతడిని హాజరుపరిచారు. గత రెండు రోజులుగా కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ రవాణా చేసే ట్రాన్స్ పోర్టర్లు, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై, కార్యాలయాలపై అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘M/s Manoj Enterprises’ అనే ఒక డమ్మీ జీఎస్‌టీ సంస్థను సృష్టించి మనోజ్ తారా అనే వ్యక్తిని (తన బార్య) దానికి ప్రొప్రైటర్‌గా చూపించారు. అయితే, అసలు విషయం ఏంటంటే.. తన పేరిట ఒక సంస్థ రిజిస్టర్ అయి ఉందనే సంగతి ఆ మనోజ్ తారా అనే వ్యక్తికే తెలియదు! గ్రానైట్ సిండికేట్ సభ్యులు అతడి ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసి ఈ డమ్మీ సంస్థను క్రియేట్ చేశారు. నిందితుడు శ్రీకాంత్ దాసరి తన భార్య మొబైల్ నంబర్ ద్వారా ఈ నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ డమ్మీ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం తన స్నేహితుడి బ్యాంక్ అకౌంట్‌ను వాడినట్లు విచారణలో తేలింది. ఈ ఆపరేషన్‌లో బ్రోకర్లు, గ్రానైట్ మార్కెట్లు, గ్రానైట్ ఫ్యాక్టరీలు కలిసి నకిలీ ఈ-వే బిల్లుల రాకెట్ నడుపుతున్నట్లు స్పష్టమైంది. కరీంనగర్ నుండి హైదరాబాద్‌లోని షేర్ లింగంపల్లి, ఘట్‌కేసర్, ప్రజ్ఞాపూర్ వంటి ప్రాంతాల్లోని పలు దుకాణాలకు అక్రమంగా గ్రానైట్ స్లాబులను తరలిస్తున్న లారీలను, స్టాక్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ డ్రైవర్ల ద్వారా నగదు రూపంలోనే చెల్లిస్తూ ఈ నెట్‌వర్క్ గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఈ అక్రమ రవాణా దందాలో శ్రీకాంత్‌తో పాటు రాజస్థాన్‌కు చెందిన మరికొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీలో దళారుల దందా..
కరీంనగర్ జిల్లాలో వందలాదిగా ఉన్న గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లలో వినియోగదారులకు లాభం చేకూరుస్తున్నామనే ముసుగులో దళారులు రంగప్రవేశం చేసి ప్రభుత్వ ఆదాయానికి రోజువారీగా లక్షల్లో గండి కొడుతున్నారు. నిబంధనల ప్రకారం గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ చేసిన అమ్మకాలపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక లక్ష రూపాయల బిల్లుపై రూ. 18 వేలు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్లాలి. కానీ ఇక్కడే దళారులు తమ మార్కు స్కెచ్ వేశారు. వినియోగదారుల నుంచి 35 నుండి 40 శాతం వరకు జీఎస్‌టీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ.. సర్కారుకు మాత్రం సగానికి పైగా పన్ను ఎగవేస్తున్నారు.
కేవలం 7 శాతానికే నకిలీ బిల్లుల సృష్టి ..
లక్ష రూపాయల బిల్లుకు కేవలం రూ. 7 వేల వరకే చెల్లించి నకిలీ బిల్లులు ఇస్తూ దర్జాగా దందా సాగిస్తున్నారు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. అసలు 18 శాతం పన్ను వసూలు కాకుండా వ్యాపారం ఎలా కొనసాగుతోందనేది ఇప్పుడు పెద్ద పజిల్‌గా మారింది. జీఎస్‌టీ పోర్టల్ లోని సాంకేతిక లోపాలను, ప్రభుత్వ నిబంధనల్లోని సందులను ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు తెరలేపినట్లు గ్రానైట్ పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనివల్ల నిబంధనల ప్రకారం నడుపుతున్న మిగతా యూనిట్ల యజమానులు బ్యాంక్ రుణాలు కూడా చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘బినామీ లైసెన్సుల’ వ్యవహారం
కొంతమంది దళారులు అమాయక ప్రజలను మభ్యపెట్టి, వారి ఆధార్, పాన్ కార్డులతో జీఎస్‌టీ లైసెన్సులు తీసుకుంటున్నారు. వాటి ద్వారా తక్కువ పన్ను చూపిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నారు. రేపటి రోజున అధికారులు దాడులు చేసి, ఆ లైసెన్సులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినా.. దళారులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే కేసులన్నీ ఆ అమాయక బినామీలపైనే నమోదవుతాయి. వారు పన్ను కట్టే స్థితిలో లేరని అధికారులు కేసు క్లోజ్ చేస్తారనే ధీమాతో దళారులు సేఫ్ జోన్‌లో ఉండి ఈ దందాను నడిపిస్తున్నారు. గతంలో జీఎస్‌టీ అధికారులు కఠినంగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగింది. కానీ ఇప్పుడు అధికారులు పట్టించుకోకపోవడంతో దళారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీజీఐ హైదరాబాద్ అధికారులు ఈ భారీ స్కామ్‌పై ముమ్మర దర్యాప్తు జరుపుతుండగా మరిన్ని వెలుగులోకి రానున్నాయి.

