epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

విచారణను నిలిపేసేలా ఆదేశాలివ్వండి.. ఢిల్లీ హైకోర్టుకు ‘ఆపిల్’ కంపెనీ అప్పీల్

కలం, తెలంగాణ బ్యూరో : యాపిల్ (Apple) ఫోన్ తయారీ కంపెనీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపెటిషన్ కమిషన్‌కు (CCI) మధ్య నెలకొన్న వివాదం సరికొత్త మలుపు తిరుగుతున్నది. నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా తప్పదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ జరిమానాను ఫిక్స్ చేయడానికి కంపెనీ ఫైనాన్షియల్ వివరాలను అందించాలని కమిషన్ కోరుతున్నది. ఇది తమ కంపెనీ ప్రైవసీ పాలసీకి విరుద్ధమని యాపిల్ వాదిస్తున్నది. చివరకు ఈ వివాదం కోర్టుకెక్కింది. దీంతో విచారణను తాత్కాలికంగా నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆపిల్ కంపెనీ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

యాపిల్, కమిషన్ మధ్య వివాదమేంటి? :

యాపిల్ కంపెనీ తన ఐఫోన్‌లలో వాడే ఐఓఎస్ (iOS) సాఫ్ట్ వేర్ పై గుత్తాధిపత్యంతో యాప్ స్టోర్‌లో యాప్‌లను అప్‌లోడ్ చేసే డెవలపర్లు స్వంత యాపిల్ కంపెనీకి చెందిన సొంత పేమెంట్ వ్యవస్థనే వాడాలని కంపెనీ యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నదని కాంపెటెటివ్ కమిషన్ ఆరోపించింది. ప్రతీ యాప్ లావాదేవీపైన యాపిల్ కంపెనీ 30% మేర కమిషన్ వసూలు చేస్తున్నదని, ఇది చిన్న డెవలపర్లకు భారంగా మారుతున్నదని, ఫలితంగా పోటీ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నదని సీసీఐ తన ప్రాథమిక విచారణలో పేర్కొన్నది. దీనికి వ్యతిరేకంగా యాపిల్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 15న పిటిషన్ దాఖలు చేసి తదుపరి ప్రొసీడింగ్స్ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

భారీ స్థాయిలో జరిమానా :

కేంద్ర ప్రభుత్వం 2024లో సవరించిన కాంపెటిషన్ చట్టం ప్రకారం ఏదైనా కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తే కేవలం భారత్‌లో జరిగే లావాదేవీల మీద వస్తున్న ఆదాయం ఆధారంగా కాకుండా ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లావాదేవీల ద్వారా ఆర్జించే ఆదాయం/టర్నోవర్ ఆధారంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా యాపిల్ (Apple) కంపెనీ లావాదేవీలు జరుగుతున్నందున మొత్తం గ్లోబల్ ఫైనాన్షియల్ రికార్డులను సమర్పించాలని, దాని ఆధారంగా జరిమానాను ఫిక్స్ చేస్తామన్నది సీసీఐ వాదన. బహుళజాతి సంస్థలు నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండాలంటే గ్లోబల్ టర్నోవర్ ఆధారంగానే పెనాల్టీని లెక్కించాల్సి ఉంటుందని వివరించింది. దీని ప్రకారం యాపిల్ కంపెనీ దాదాపు 38 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.15 లక్షల కోట్లు) మేర సీసీఐకి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇది మోయరాని భారమే : యాపిల్

గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టులు/రికార్డులను బహిర్గతం చేయడం యాపిల్ కంపెనీ ప్రైవసీ పాలసీకి విరుద్ధమని యాజమాన్యం వాదిస్తున్నది. కంపెనీ గోప్యత బహిర్గతమై వ్యాపార రహస్యాలన్నీ బట్టబయలవుతాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో యాపిల్ పేర్కొన్నది. చట్టం రూపొందించింది భారతదేశం అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానా వేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. ఈ స్థాయిలో జరిమానా కట్టాల్సి వస్తే అది తమ కంపెనీకి మోయలేని భారంగా ఉంటుందని, ఇది విపరీత పరిణామంగా మారుతుందని పేర్కొన్నది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో యాపిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Read Also: పరాగ్ అగర్వాల్.. పడిలేచిన కెరటం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>